రివ్యూయర్స్ పై శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ నీచమైన కామెంట్స్!

ఆయన నటించిన ‘పొట్టేల్‌’ సినిమాకి ఇచ్చిన రివ్యూలు నచ్చకపోవడంతో.. మీడియా ముఖంగా రాయలేని భాషలో దూషించారు.

Update: 2024-10-26 10:22 GMT

సినిమా రివ్యూల మీద ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చలు జరుగుతుంటాయి. వీటిపై ఇండస్ట్రీ జనాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. రివ్యూలు తమకు పాజిటివ్ గా ఉంటే ఎలాంటి సమస్య లేదు కానీ.. అదే సినిమాలో నెగెటివ్ పాయింట్స్ ప్రస్తావించి, తప్పొప్పులను ఎత్తిచూపితే మాత్రం రివ్యూ రైట‌ర్లు సమీక్షకుల మీద విరుచుకుపడుతుంటారు. తాజాగా యాక్టర్ శ్రీ‌కాంత్ అయ్యంగార్ రివ్యూ రైట‌ర్లపై తన అక్కసు వెళ్లగక్కారు. ఆయన నటించిన ‘పొట్టేల్‌’ సినిమాకి ఇచ్చిన రివ్యూలు నచ్చకపోవడంతో.. మీడియా ముఖంగా రాయలేని భాషలో దూషించారు.

నిన్న శుక్రవారం రిలీజైన ‘పొట్టేల్‌’ సినిమాకి మేకర్స్ ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారని శ్రీ‌కాంత్ అయ్యంగార్ కామెంట్స్ చేసారు. జీవితంలో షార్ట్ ఫిలిం తీయని వాళ్ళు వచ్చి రివ్యూలు ఇస్తున్నారు.. పారసైట్స్ అంటూ అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడారు. ఇక్కడ ఆయన రివ్యూ రైటర్లను విమ‌ర్శించ‌డం వ‌ర‌కూ ఓకే కానీ, దీని కోసం సభాముఖంగా ఆయన ఉపయోగించిన ప‌ద‌జాలం మాత్రం అభ్యంతరకరం.

సినిమాకి రివ్యూలు ఇవ్వడం అనేది ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. సోషల్ మీడియా లేని రోజుల్లోనూ సినిమా సమీక్షలు రాసేవారు. రివ్యూ రైటర్ తన దృష్టి కోణంలో రాసే రివ్యూల మీద ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు. ప్రతి వ్యక్తికి ప్రతి విషయం మీద స్పందించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నాయి. కానీ ఆ సందర్భంలో వాడే భాష అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇప్పుడు రివ్యూ రైటర్ల మీద శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన కామెంట్లు అత్యంత నీచమైనవి. అందుకే అందరూ ఇప్పుడు శ్రీ‌కాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.

నిజానికి ‘పొట్టేల్‌’ సినిమాకు మంచి రివ్యూలే వ‌చ్చాయి. కొన్ని లోటు పాట్లు క‌నిపించినా, దాదాపు అంతా మంచి విషయాలే చెప్పారు. నిజాయితీగా మంచి ప్రయత్నం చేసారని చిత్ర బృందాన్ని అభినందించారు. ఇదే సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాహిత్ మోత్కూరి మాట్లాడుతూ.. ''80 శాతం మంది పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈమ‌ధ్య కాలంలో ఏ సినిమాకూ జరగలేదు.. అది ఈ సినిమాకు జరిగింది. చాలా రివ్యూల్లో ఇదొక హానెస్ట్ అటెంప్ట్ అని రాశారు. అందరి పెర్ఫార్మన్స్ ల గురించి మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు థాంక్యూ'' అంటూ రివ్యూ రైట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కానీ శ్రీ‌కాంత్ అయ్యంగార్ మాత్రం రివ్యూలను తప్పుబడుతూ, రివ్యూ రైట‌ర్ల‌పై నోరుపారేసుకున్నారు.

చిన్న సినిమాలకు రివ్యూలు ఎంతగా ఉపయోగపడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా టాక్ స్ప్రెడ్ అవడంలో రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులు ఆ సినిమా పట్ల ఆకర్షితులు అవ్వడానికి, వారు థియేటర్లకు వచ్చేలా చేయడానికి రివ్యూలు సహకరిస్తాయి. అలానే రివ్యూల్లో తప్పులను ఎత్తి చూపితే.. ఆ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు తన తదుపరి చిత్రాల్లో అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటారు. ఇది వారికి హెల్ప్ చేస్తుందే తప్పితే, వాళ్ళను తక్కువ చెయ్యదు. అయినా మంచి సినిమాలను కంటెంట్ ఉన్న చిత్రాలను ఎవరూ ఆపలేరు. కాబట్టి రివ్యూ రైటర్ల మీద ఇలాంటి చవకబారు మాటలు మానుకొని, మంచి కంటెంట్ ను ఆడియన్స్ కు అందించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.


Full View


Tags:    

Similar News