పుష్ప 2 : గడ్డం వల్ల 8 సినిమాలు వదులుకున్నాడట..!
తాజాగా శ్రీతేజ్ నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు శ్రీతేజ్. ఆ సినిమాతో మంచి గుర్తింపు దక్కడంతో పాటు ఆయన నటించిన ధమాకా మరియు మంగళవారం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.
తాజాగా శ్రీతేజ్ నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్యాలెంటెడ్ యాక్టర్ గా పేరు దక్కించుకున్న శ్రీతేజ్ కి బహిష్కరణ మరింత క్రేజ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తన వద్దకు వచ్చిన పలు ఆఫర్లను కాదన్నాడట.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీతేజ ఆ విషయాన్ని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.... పుష్ప 2 సినిమా కోసం కొన్ని సినిమాలను వదిలేశాను. ఈ మధ్య కాలంలో ఏకంగా ఎనిమిది సినిమాలకు నో చెప్పాను. పుష్ప 2 కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లేందుకు రెడీగా ఉండాలి. పైగా గడ్డం తీసి వేరే సినిమాల్లో నటించాల్సి ఉంది.
పుష్ప 2 కోసం పెంచిన గడ్డం తీయడం వల్ల ఆ సినిమా షూటింగ్ కి ఇబ్బంది. హఠాత్తుగా పిలిస్తే గడ్డం లేకుంటే బాగుండదు అనే ఉద్దేశ్యంతో నేను నా వద్దకు వచ్చిన పలు సినిమాలను కాదన్నాను అంటూ శ్రీతేజ్ చెప్పుకొచ్చాడు. ఈ స్థాయి గడ్డం రావడంకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది.
అప్పటి వరకు నా కోసం పుష్ప 2 టీం వెయిట్ చేయలేదు కదా.. అందుకే గడ్డం తీసే అవసరం ఉన్న సినిమాలను మరియు సిరీస్ లను, పాత్రలను కాదన్నాను అంటూ శ్రీతేజ్ చెప్పుకొచ్చాడు. పుష్ప 2 గురించి ఆయన మాట్లాడుతూ కచ్చితంగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల అంచనాలు అందుకునే విధంగా సినిమా ఉంటుంది అన్నాడు.