వేశ్యలు, రెడ్-లైట్ ఏరియాల కథల చుట్టూ తిరుగుతున్న స్టార్ డైరెక్టర్!

అయితే భన్సాలీ తీసే సినిమాలపై వేశ్యల ప్రభావం బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

Update: 2024-05-04 03:15 GMT

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచిన దిగ్గజ దర్శకుడు.. పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆయన తెరకెక్కించిన 'దేవదాస్' 'గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలా', 'బాజీరావ్‌ మస్తానీ', 'పద్మావత్‌' తదితర చిత్రాలన్నీ కళాఖండాలు అనిపించుకోవడమే కాదు, బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే భన్సాలీ తీసే సినిమాలపై వేశ్యల ప్రభావం బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కథలన్నీ వేశ్య గృహాలు, రెడ్-లైట్ ఏరియాల చుట్టూనే తిరుగుతాయి. వాటిల్లో ప్రధాన పాత్రదారులు ఎక్కువగా వేశ్యలుగా కనిపిస్తారు. 'దేవదాస్' మూవీ నుంచి 'హీరామండి' వెబ్ సిరీస్ వరకూ గమనిస్తే, మనకు ఈ విషయం అర్థమవుతుంది.

బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్. మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా 'దేవదాస్' (2002). ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ అదే పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో చంద్రముఖి అనే వేశ్య పాత్రలో మాధురీ నటించింది. రణబీర్ కపూర్, సోనమ్ కపూర్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ 2007లో భన్సాలీ రూపొందించిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'సావరియా'. ఈ సినిమాలో గులాబ్జీ అనే ప్రాస్టిట్యూట్ పాత్రను బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ పోషించింది.

స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ తీసిన 'గంగూబాయి కతియావాడి' (2022) సినిమా కథంతా వేశ్యలు, వేశ్య గృహాలు చుట్టూనే తిరుగుతుంది. 'మేడమ్ ఆఫ్‌ కామతిపుర'గా పిలవబడిన ముంబై మాఫియా క్వీన్‌ గంగుబాయి బయోపిక్ ఇది. ఆలియా టైటిల్ రోల్ పోషించగా.. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించారు. అనుకోని పరిస్థితుల్లో వేశ్యగా జీవితాన్ని ప్రారంభించిన గంగుబాయి.. బొంబాయిలోని రెడ్ లైట్ ఏరియాలో నివసిస్తున్న సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఎలాంటి పోరాటం చేసిందనేది ఈ సినిమాలో చూపించారు. దీంట్లో వేశ్యల జీవితాలను భన్సాలీ అద్భుతంగా తెర మీద ఆవిష్కరించారు.

ఇప్పుడు లేటెస్టుగా 'హీరామండి: ది డైమండ్‌ బజార్‌' అంటూ వచ్చారు సంజయ్‌ లీలా భన్సాలీ. ఇది ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌ సిరీస్‌. భారీ తారాగణంతో 8 ఎపిసోడ్ లుగా రూపొందించిన ఈ పీరియాడిక్‌ డ్రామా సిరీస్.. మే 1న నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా, తెలుగు సహా 14 భాషల్లో స్ట్రీమింగ్‌ కాబడింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని, ఓటీటీలో ట్రెండింగ్ లో నిలిచింది. స్వాతంత్య్రానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న హీరామండి అనే వేశ్యావాటికలో జరిగిన పలు సంఘటనల సమాహారమే ఈ సిరీస్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ తదితరులు నటించారు. దీంట్లో మహిళా ప్రధాన పాత్రధారులందరూ వేశ్యలుగానే కనిపిస్తారు. వేశ్యవాటిక నేపథ్యంలో సాగే కథే అయినప్పటికీ, ఒక్కచోట కూడా అసభ్యకరమైన సన్నివేశం కానీ, అసభ్య పదజాలం కానీ లేకుండా రూపొందించారు భన్సాలీ.

ఇలా సంజయ్‌ లీలా భన్సాలీ అనేక వేశ్యల కథలను తెర మీద ఆవిష్కరించారు. ఈ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడమే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నాయి. అయితే దర్శకుడిపై వేశ్యలు, వేశ్య గృహాల ప్రభావం పడటానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, భన్సాలీ ముంబైలోని రెడ్ లైట్ ఏరియా కామాతిపురకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో పెరిగాడు. అక్కడి మహిళల జీవితాలను చాలా దగ్గరగా చూసినట్లు ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కేవలం 20 రూపాయల కోసం అలాంటి వృత్తిలో దిగిన మహిళలను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి ముఖాల్లో ఎప్పుడూ మాట్లాడని అద్భుతమైన కథలు కనిపించాయని, తన మదిలో నిలిచిపోయిన కథలనే తెర మీదకు తీసుకొస్తున్నట్లుగా సంజయ్‌ తెలిపారు.

Tags:    

Similar News