బాక్సాఫీస్ వద్ద దెయ్యం డామినేషన్.. క్లిక్కయితే బీభత్సమే.

అయితే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సినిమాల కంటే శ్రద్ధ కపూర్ నటించిన 'స్త్రీ2' సినిమాకి జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉండడం విశేషం.

Update: 2024-08-12 10:30 GMT

ఈ ఏడాది బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లభించలేదు. భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. అదే సమయంలో తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలుగా రిలీజ్ అయినవి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకున్నాయి. స్టార్ హీరోల నుంచి వచ్చిన మూవీస్ మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అవుతూనే ఉన్నాయి.

హిందీలో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూవీగా కల్కి 2898 ఏడీ ఉందంటే హిందీ సినిమాలకి ఏ స్థాయిలో ఆదరణ తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు కథల ఎంపిక విషయంలో తిరిగి పునరాలోచనలో పడ్డారు. ప్రేక్షకులకి నచ్చే కథలు పైన దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ వరుస డిజాస్టర్లు అందుకుంటున్నారు. ఆయన కొత్త సినిమా 'ఖేల్ ఖేల్ మే' ఆగస్టు 15న థియేటర్స్ లోకి వస్తోంది.

అదేరోజు జాన్ అబ్రహం 'వేదా' సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఈ రెండింటికి పోటీగా శ్రద్ధా కపూర్ నటించిన హర్రర్ మూవీ 'స్త్రీ2' రిలీజ్ అవుతోంది. అయితే అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం సినిమాల కంటే శ్రద్ధ కపూర్ నటించిన 'స్త్రీ2' సినిమాకి జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతూ ఉండడం విశేషం. ఈ మూవీ రిలీజ్ కి ఇంకా ఐదు రోజులు ఉండగానే లక్ష టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ 'స్త్రీ'కి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది.

అది కూడా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరగడానికి ఒక కారణమని చెప్పొచ్చు. ఆగస్టు 15 మార్నింగ్ షో పడేలోపు కనీసం నాలుగు లక్షల వరకు 'స్త్రీ2' మూవీ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడయ్యే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అక్షయ్ కుమార్ 'ఖేల్ ఖేల్ మే' సినిమాకి కనీసం 10,000 టికెట్లు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడు కాలేదంట. ప్రమోషన్స్ పరంగా అయితే ఆ సినిమా ఫాస్ట్ గా ఉంది.

కానీ ఎందుకనో ప్రేక్షకులు అక్షయ్ కుమార్ సినిమాపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. జాన్ అబ్రహం వేదా సినిమాకి కూడా ఓ మోస్తరుగా బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 'స్త్రీ2' సినిమాకి రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో కూడా మల్టీప్లెక్స్ లలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం 'స్త్రీ2' మూవీకి వస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే యానిమల్, టైగర్ 3, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 లతో పోటీ పడుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బుకింగ్స్ పరంగా జోరు మరింత పెరిగితే టాప్ 3 అడ్వాన్స్ బుకింగ్ చిత్రాలలో ఒకదానిని బ్రేక్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News