ఓటీటీల్లోకి సినిమాలు.. సుధీర్ బాబు ఏమన్నారంటే?
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు.. తన అప్ కమింగ్ మూవీ హరోం హర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు.. తన అప్ కమింగ్ మూవీ హరోం హర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. హరోం హరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. సినీ ప్రియులు.. ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
దీంతో కొన్ని ఓటీటీల నిర్వాహకులు.. పెద్ద ఎత్తున డీల్స్ కుదుర్చుకుంటున్నారు. థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై సుధీర్ బాబు స్పందించారు. థియేటర్ల వ్యాపారాన్ని ఓటీటీలు ప్రభావితం చేసున్నాయని పరోక్షంగా తెలిపారు సుధీర్ బాబు. సరైన నిబంధనలు తీసుకొస్తే.. రెండు వ్యవస్థలు కరెక్ట్ గా సాగుతాయని అభిప్రాయపడ్డారు. లేకుంటే ముప్పుగా మారే అవకాశం ఉందని అన్నారు.
"వాస్తవానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ నుంచి మేకర్స్ కు మంచి డీల్స్ వస్తున్నాయి. వాటిని కుదుర్చుకుంటున్నారు. దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన తక్కువ గ్యాప్ తోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రెండు మూడు వారాల్లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. థియేట్రికల్ రన్ కచ్చితంగా పెంచాల్సి ఉంది. ఓటీటీలకు సంబంధించి సరైన రూల్స్ ఉండాలి. ఇప్పుడు లాభాల కోసం ఆలోచిస్తే.. భవిష్యత్తులో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి" అని అన్నారు.
స్వల్పకాలిక లాభాల కోసం నిర్మాతలు డీల్స్ కుదుర్చుకుని, త్వరగా స్ట్రీమింగ్ కు ఛాన్స్ ఇస్తే.. భవిష్యత్తులో థియేట్రికల్ రిలీజ్ లు పూర్తిగా ఉండవని అభిప్రాయపడ్డారు సుధీర్ బాబు. థియేట్రికల్, ఓటీటీ విడుదల మధ్య కచ్చితంగా 40 నుంచి 50 రోజుల గ్యాప్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే అంతే సంగతులని హెచ్చరించారు! దీంతో సుధీర్ బాబు చేసిన వ్యాఖ్యలు.. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక సుధీర్ హరోంహరా మూవీ 1989లో కుప్పంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. మూవీపై సూపర్ బజ్ కూడా క్రియేట్ చేశాయి. దీంతో సుధీర్ బాబు గట్టి కమ్ బ్యాక్ ఇస్తాననే నమ్మకంతో ఉన్నారు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.