హేమ క‌మిటీ నివేదిక‌పై ఈ సీక్వెల్ తీయ‌డం లేదు

సీక్వెల్ క‌థ కోసం జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదికను ద‌ర్శ‌కుడు ఉప‌యోగించుకుంటున్నార‌ని తామ‌ర‌తంప‌ర‌గా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

Update: 2024-09-26 02:45 GMT

కేర‌ళ నుంచి అంద‌మైన టీనేజీ యువ‌తుల‌ను ప్రేమ ముగ్గులోకి దించి, విదేశాల‌కు త‌ర‌లించే ముష్క‌రుల కుట్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన `ది కేర‌ళ స్టోరి` సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు సుదీప్తో సేన్ పేరు మార్మోగింది. నిజ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసిన ఈ సినిమా వివాదాల‌కు కేంద్ర‌బిందువు అయింది. ఇందులో అస‌త్యాలెన్నిటినో అందంగా చూపించార‌ని విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. ఇటీవ‌ల `ది కేర‌ళ స్టోరి 2` గురించి మ‌రో వివాదం చెల‌రేగింది. సీక్వెల్ క‌థ కోసం జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదికను ద‌ర్శ‌కుడు ఉప‌యోగించుకుంటున్నార‌ని తామ‌ర‌తంప‌ర‌గా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఇప్పుడు `ది కేరళ స్టోరీ` దర్శకుడు సుదీప్తో సేన్ తన సినిమా సీక్వెల్ వెనుక కథ గురించిన అన్ని పుకార్లను కొట్టిపారేశాడు. కొన్ని వార్తా పోర్టల్‌లు పేర్కొన్నట్లు వివాదాస్పద `జ‌స్టిస్ హేమా క‌మిటీ నివేదిక` ఆధారంగా తన చిత్రం ఉండదని చెప్పారు. హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అత‌డు నిరాధార క‌థ‌నాలు అని కొట్టి పారేసాడు. ప్ర‌స్తుతం సీక్వెల్ చిత్రీక‌ర‌ణ‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని సుదీప్తో సేన్ ధృవీకరించాడు. ``ఈ సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు.. ఇది నిజం కాదు. వార్తా క‌థ‌నాలు చూసిన తర్వాత విపుల్ షా (చిత్ర నిర్మాత) నేను నవ్వుకున్నాం. ఈ చిత్రానికి ఒక యుఎస్‌పి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పని జరుగుతోంది.. కానీ హేమా కమిషన్ నివేదికతో మా క‌థ‌కు ఎలాంటి సంబంధం లేదు`` అని ఆయన అన్నారు.

ది కేరళ స్టోరీలో ప్రధాన పాత్ర పోషించిన అదా శ‌ర్మ ఈ సీక్వెల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించాల్సి ఉంది. మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని బట్టబయలు చేసిన హేమా కమీషన్ నివేదిక దేశవ్యాప్తంగా అలలు సృష్టించింది. కొన్ని స్వతంత్ర చలనచిత్ర సంస్థలు తమ పరిశ్రమలలో లైంగిక వేధింపులపై ఇదే విధమైన విచారణను కోరుతున్నాయి. `ది కేరళ స్టోరీ` క‌థ దీనికి రిలేటెడ్ గా కూడా ఉంది. కేరళలో జరిగిన రాడికలైజేషన్ నిజకథ ఆధారంగా రూపొందించిన‌దని మేకర్స్ పేర్కొన్న తర్వాత విడుదల సమయంలో వివాదానికి దారితీసింది.

Tags:    

Similar News