దర్శకులందు.. సుకుమార్ శిష్యులు వేరయా

ఇక సుకుమార్ లాగానే ఆయన శిష్యులు కూడా సూపర్ డూపర్ హిట్లను తెరకెక్కిస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు.

Update: 2024-05-04 02:45 GMT

19 ఏళ్ల క్రితం ఆర్య మూవీతో దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లెక్కల మాస్టర్ సుకుమార్.. ఫస్ట్ సినిమాతోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నారు. మూడేళ్ల క్రితం పుష్పతో పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించారు. రాజమౌళి తర్వాత తెలుగు చిత్రాన్ని నేషనల్ లెవెల్ లో నిలబెట్టారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ను నేషనల్ అవార్డు దక్కేలా కూడా చేశారు. త్వరలో పుష్ప-2తో మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక సుకుమార్ లాగానే ఆయన శిష్యులు కూడా సూపర్ డూపర్ హిట్లను తెరకెక్కిస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. సుకుమార్ శిష్యుడంటే చాలు... నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ పెట్టడానికి సిద్ధమైపోతున్నారు. శిష్యుడు విజయం సాధిస్తే.. అంతకుమించిన ఆనందం గురువుకు ఏముంటుంది చెప్పండి! ఇప్పుడు సుకుమార్ ఆ ఆనందాన్నే టన్నుల కొద్దీ అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సుకుమార్ శిష్యుల ట్రాక్ రికార్డు మామూలుగా లేదు.

లేటెస్ట్ గా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన మరో డైరెక్టర్ సూపర్ హిట్ కొట్టేశారు. ఆయనే అర్జున్ వీకే. సుహాస్ నటించిన ప్రసన్నవదనం మూవీని ఆయనే తెరకెక్కించారు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే వినూత్న కాన్సెప్ట్‌ తో మూవీని తీర్చిదిద్దారు. ఫస్ట్ మూవీ అయినా క‌థ‌ను ఎంతో క్లారిటీగా తెర‌పైకి తీసుకొచ్చారు. అర్జున్ రచనలో బలం ఉందని సినీ ప్రియులు చెబుతున్నారు. ఆయన కన్నా ముందు మరో నలుగురు సుక్కు శిష్యులు సూపర్ హిట్లు కొట్టారు.

గత ఏడాది విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడే. ఈ సినిమాకు సుక్కు స్క్రీన్ ప్లే అందించారు. నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు. అందుకే తన సినిమా మరో స్థాయికి వెళ్లిందని కార్తీక్ చాలా సార్లు చెప్పారు. కార్తీక్ వర్క్ కు అప్పట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు దసరా సినిమాతో మరో సుక్కు శిష్యుడు శ్రీకాంత్ ఓదెల అదిరిపోయే హిట్ కొట్టారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి పలు సినిమాలకు శ్రీకాంత్‌.. సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పనిచేశారు.

మూడేళ్ల క్రితం ఉప్పెనతో సంచలనం సృష్టించిన బుచ్చి బాబు కూడా సుకుమార్ వద్ద శిష్యరికం పొందారు. సుక్కు ప్రోత్సాహంతో డైరెక్టర్ గా మారి ఫస్ట్ మూవీతో రూ.100 కోట్ల హిట్ కొట్టారు. ఇప్పుడు స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక కరెంట్‌ మూవీతో దర్శకుడిగా పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్‌ కూడా సుక్కు శిష్యుడే. తొలి సినిమాతో నిరాశపరిచినా.. రెండో మూవీ కుమారి 21 ఎఫ్‌ తో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఇండస్ట్రీలో సరైన సక్సెస్ అందుకోలేకపోయినా.. దర్శకులుగా మారిన సుక్కు శిష్యులు మరింత మంది ఉన్నారు. నిజానికి.. సుక్కు తన దగ్గర పనిచేసే వారందరూ డైరెక్టర్లుగా మారాలనుకుంటారు. వాళ్లకు మంచి అవకాశాలు ఇస్తారు. సహకారం కూడా అందిస్తారు. శిష్యులు పిలవగానే వారి మూవీల ఈవెంట్స్ కు వస్తుంటారు. వాళ్ల గురించి మాట్లాడి సినిమాపై హైప్ పెంచుతుంటారు. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తే.. ఏ శిష్యుడు విజయం సాధించడు చెప్పండి!

Tags:    

Similar News