రజనీకాంత్ కి బీసీసీఐ 'గోల్డెన్ టికెట్'... వరల్డ్ కప్ కు వెల్ కం!
తాజాగా బీసీసీఐ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ విషయాన్ని వెళ్లడించిన ఆయన... దీనికి సంబంధించిన ఫోటోను కూడా పొస్ట్ చేశారు
ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ - 2023కు భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీని గ్రాండ్ సక్సెస్ చేయాలని బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా గోల్డెన్ టికెట్ ను తెరపైకి తీసుకొచ్చింది.
అవును... క్రికెట్ వరల్డ్ కప్ - 2023 ఈవెంట్ కు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించడంలో భాగంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) గోల్డెన్ టికెట్ ను తీసుకొచ్చింది. ఇండియాలోని ప్రముఖులకు ఈ గోల్డెన్ టికెట్ ను అందజేస్తోంది. ఫలితంగా ఈ టికెట్ పొందిన ప్రముఖులు వరల్డ్ కప్ మ్యాచ్ లో వీఐపీ మర్యాదలు పొందుతారు.
ఈ గోల్డెన్ టికెట్ ను ముందుగా అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. స్వయంగా అమితాబ్ బచ్చన్ కు గోల్డెన్ టికెట్ ను అందజేశారు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కు ఈ గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసి ఆయనకు గోల్డెన్ టికెట్ అందజేశారు బీసీసీఐ సెక్రటరీ జై షా.
తాజాగా బీసీసీఐ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ విషయాన్ని వెళ్లడించిన ఆయన... దీనికి సంబంధించిన ఫోటోను కూడా పొస్ట్ చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ను ఓ విశిష్ట అతిథిగా భావిస్తూ వరల్డ్ కప్ కు ఆహ్వానించినట్టు బీసీసీఐ వెల్లడించింది. అనంతరం భాష, సంస్కృతికి అతీతంగా లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటుడు తలైవా అని కొనియాడింది బీసీసీఐ!
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 5న ఇంగ్లండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ తో ఈ ఏడాది ప్రపంచ కప్ పోటీలు మొదలవుతాయి. భారత్ తొలి మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనుంది. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం రెండు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ జట్ల మధ్య.. అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి.