సూర్య జాతీయ అవార్డ్ కోసం ప్రయత్నమా?
అయితే సూర్య ఇటీవల బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కంగువ ఇదే తరహా. ఇది భారీ వారియర్ యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోంది.
స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సౌత్ లో హవా చాటాల్సిన సందర్భమిది. కానీ అతడి నుంచి జైభీమ్ తర్వాత సరైన సినిమా రాలేదు. మధ్యలో విక్రమ్- రాకెట్రీ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించాడు. అయితే సూర్య ఇటీవల బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కంగువ ఇదే తరహా. ఇది భారీ వారియర్ యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోంది.
అయితే దీనికంటే ముందే ప్రకటించిన సూర్య- వెట్రిమారన్‌ల 'వాడివాసల్' కొన్ని సంవత్సరాలుగా ఆలస్యం అవుతూనే ఉంది. ఇది భారీ అంచనాలతో రూపొందే తమిళ సినిమాలలో ఒకటి. ఈ చిత్రాన్ని జల్లి కట్టు నేపథ్యంలో తెరకెక్కించేందుకు వెట్రిమారన్ ప్రయత్నిస్తున్నారు. వందలాది ఎద్దులతో టెస్ట్ షూట్ కూడా చేసారు. అయితే ఈ చిత్రం అనేక కారణాల వల్ల చాలా ఆలస్యం అయింది. UKలో CG వర్క్స్ కూడా ఏకకాలంలో జరుగుతుండగా, సూర్య ఇప్పటికే జల్లికట్టుపై శిక్షణను కొనసాగిస్తున్నాడు.
నటుడు-దర్శకుడు అమీర్ 'వాడివాసల్'లో ఒక ప్రధాన పాత్రలో నటించనున్నట్లు చాలా కాలం క్రితం వెల్లడైంది. దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో ఇదే విషయాన్ని ధృవీకరించారు. కథ అమీర్ స్వగ్రామంలో సెట్ చేసినందున తాను అమీర్‌ని ఎంచుకున్నానని, ఎద్దుల పోరాట సన్నివేశాలు, స్థానిక భాష ప్రామాణికత గురించి ఇన్‌పుట్‌లను పొందడం సులువు అవుతుందని కూడా తెలిపాడు.
గతంలో అమీర్ దర్శకత్వంలో 2002లో విడుదలైన 'మౌనం పేసియాదే' తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల కు అమీర్ - సూర్య మళ్లీ ఒక్కటవడం గమనించదగ్గ విషయం. వెట్రిమారన్ కూడా తన 'విడుతలై 2' (సేతుపతి) చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత 'వాడివాసల్' సెట్స్‌పైకి వెళ్తుందని ధృవీకరించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో 'కంగువ' చిత్రాన్ని పూర్తి చేసే దశలో ఉన్నాడు. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో 'సూర్య 43'... బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య 44లో నటించనున్నాడు. జాతీయ అవార్డ్ దర్శకుడు వేట్రిమారన్ తో ప్రయత్నం కచ్ఛితంగా సూర్యకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జైభీమ్ తో ఆశించిన జాతీయ అవార్డ్ దక్కలేదు. కానీ వాడివాసల్ తో సాధించుకోవాలని పంతంతో ఉన్నాడట. ఈ సినిమా కోసం వెట్రిమారన్ చాలా సీరియస్ గా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.