దేవర.. అందుకే విడుదలపై క్లారిటీ ఇవ్వడం లేదా?
తాజా సమాచారం ప్రకారం, 'దేవర' మొదటి భాగానికి సంబంధించిన యాక్షన్ పార్ట్ షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ని సమ్మర్ కానుకగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ ముందుగా చెప్పిన తేదీకి వచ్చేలా కనిపించడం లేదు. మేకర్స్ అఫిషియల్ గా చెప్పనప్పటికీ, ఈ సినిమా వాయిదా పడుతుందని ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అయితే ఇంతవరకూ తదుపరి రిలీజ్ డేట్ ప్రకటించకపోవడం.. ఎప్పుడు అనౌన్స్ చేస్తారో క్లారిటీ లేకపోవడంతో.. 'దేవర' పార్ట్-1 సినిమా ఎక్కడిదాకా వచ్చింది? ఇంకా ఎంత షూటింగ్ పెండింగ్ ఉంది? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, 'దేవర' మొదటి భాగానికి సంబంధించిన యాక్షన్ పార్ట్ షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయింది. కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకూ ఒక మాంటేజ్ సాంగ్ ను మాత్రమే షూట్ చేశారట. ఇంకా నాలుగు పాటల షూటింగ్ పెండింగ్ ఉందట. షూటింగ్ జరిగే విధానాన్ని బట్టి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఒకసారి విడుదల తేదీ ప్రకటించి, ఆ సమయానికి సినిమా కంప్లీట్ అవ్వలేదని మళ్ళీ డేట్లు మార్చడం ఇష్టం లేకనే క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా 'దేవర' సినిమాని తీర్చిదిద్దుతున్నారు డైరెక్టర్ కొరటాల శివ. సముద్ర తీరాన జరిగే కథ కావడంతో భారీ సెట్స్, అధిక విఎఫ్ఎక్స్ అవసరం అవుతున్నాయి. అందుకే ప్రీ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం తీసుకొని, కాస్త ఆలస్యంగానే షూటింగ్ స్టార్ట్ చేసారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కేటాయించాలని షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అన్నీ అనుకున్నట్లు జరగకపోవడంతో విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. అదే సమయంలో ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో, 'దేవర 1' వాయిదా పడబోతోందని స్పష్టమైంది.
నిజానికి 'దేవర' మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లపాటు షూటింగ్ కి బ్రేక్ పడింది. దాదాపు నెల రోజులు వాయిదా పడిన ఈ షూటింగ్, ఎట్టకేలకు వచ్చేవారం మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ షూటింగ్ ప్రోగ్రెస్ బట్టి రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. అయితే శివరాత్రి సందర్భంగా మార్చి 8న ఈ మూవీ రిలీజ్ పై నిర్మాతలు క్లారిటీ ఇవ్వనున్నారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
'దేవర' సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఒక పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా గ్లిమ్ప్స్ విడుదలైంది. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఆమె తంగం అనే పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషించనున్నారు. గుజరాతీ నటి శృతి మరాఠేని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న 'దేవర' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతోపాటు హిందీలోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.