బయ్యర్-ఎగ్జిబిటర్ మధ్య కొత్త లెక్క కుదిరిందా!
ఏపీలోనూ అదే సన్నివేశం కనిపిస్తుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది.
తెలంగాణ లో ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. మళ్లీ సినిమాలు రిలీజ్ అయ్యే వరకూ అవి తెరుచుకునే పరిస్థితి లేదు. మధ్యలో ఏ నిర్మాతైనా మా సినిమా రిలీజ్ చేయండి అని అడిగితే తప్ప థియేటర్లు తెరిచే సన్నివేశం లేదు. ఏపీలోనూ అదే సన్నివేశం కనిపిస్తుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం సమావేశమైంది. ఇందులో సినిమాల్ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి? ఎలాంటి ప్రాతి పదికన ప్రదర్శించాలి? నెల రోజుల వసూళ్లని ఎలా పంచుకోవాలి అన్న అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 30 కోట్లకు పైగా వెచ్చిస్తే మొదటి వారం బయ్యర్ కి 76 శాతం.. ఎగ్జిబిటర్ కి 25 శాతం, రెండవ వారం 55 -45శాతంగానూ, ఆ తర్వాత 40-60 శాతం, 30-70 శాతం లెక్కన పంపిణీ ఉండేలా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే 10 కోట్ల నుంచి 30 కోట్ల మధ్య లో కొన్న సినిమాకి తొలివారం బయ్యర్ కి 60 శాతం..ఎగ్జిబిటర్ కి 40 శాతం లెక్కన పంపిణీ చేస్తారు. తర్వాత వారం 50-50 శాతం లె క్కన, మూడవ వారం 40-60 శాతం, నాల్గవ వారం 30-70శాతం లెక్కన పంచుకుంటారు. 10 కోట్ల బడ్జెట్ సినిమాకైతే బయ్యర్ -ఎగ్జిబిటర్ 50 శాతం లెక్కన పంపకం జరుగుతుంది. రెండవ వారం 40-60 శాతం, మూడవ వారం 30-70 శాతం పంచుకునేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో సునీల్ నారంగ్- శిరీష్ తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ నిబంధన ఇప్పటికే డీల్ కుదిరిన చిత్రాలకు వర్తించదు. `ప్రాజెక్ట్-కె`, `పుష్ప-2`, `గేమ్ ఛేంజర్`, `ఇండియన్ -2` సినిమాల డీల్ ఇప్పటికే క్లోజ్ అయింది. వాటికి ఈ రూల్ వర్తించదని సంఘం ప్రతినిధి శ్రీధర్ తెలిపారు. ఇకపై పంపిణీ జరిగే కొత్త సినిమాల న్నింటికి ఈ రూల్ వర్తిస్తుంది. ఇది పూర్తిగా బయ్యర్..ఎగ్జిబిటర్..డిస్ట్రిబ్యూటర్ మధ్య నడిచే వ్యవహారం. ఇందులో చిత్ర నిర్మాతలకు ఎలాంటి సంబంధం ఉండనట్లు తెలుస్తోంది.