ఆ నంది అవార్డులు డ‌మ్మీ..,'నంది' APకి మాత్ర‌మే పేటెంట్!

Update: 2023-08-04 14:36 GMT

త్వ‌ర‌లో దుబాయ్ లో జ‌ర‌గ‌నున్న `నంది` అవార్డుల ఈవెంట్ పై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న దుబాయ్‌లో జరిగే నంది అవార్డ్‌ వేడుకకు ఫిల్మ్ చాంబర్‌కు కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కానీ ఎలాంటి సంబంధలేదని తెలిపింది. దుబాయ్‌లో జరిగే నంది అవార్డుల వేడుక నిర్మాత‌ రామకృష్ణ గౌడ్‌ వ్యక్తిగతమని పేర్కొంది. ఆ మేర‌కు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గౌరవ కార్యదర్శి కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి కె.అనుపమ్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలపమెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తాజాగా చాంబ‌ర్ ప్ర‌క‌టించింది. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడిన సంస్థలు. 24-09-2023న దుబాయ్‌లో నిర్వహించబడే టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి ఈ రెండు ఛాంబర్‌లకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఈవెంట్‌లో మేం భాగం కాదు. ఇది తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి. రామకృష్ణ గౌడ్‌ నిర్వహించే వ్యక్తిగత ప్రైవేట్‌ ఈవెంట్‌.. అని తెలుగు ఫిలిం చాంబ‌ర్ ఈ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అంతేకాదు.. రామ‌కృష్ణ గౌడ్ సార‌థ్యంలోని అసోసియేష‌న్ తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఛాంబర్‌ కాదని కూడా ఫిలించాంబ‌ర్ పెద్ద‌లు ఈ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. నంది అవార్డు అనేది ఆంధ్ర రాష్ట్రానికి పేటెంట్‌ అయినందున.. `నంది` అనే పేరును ఉపయోగించడం అవార్డు వేడుక నిర్వహించడాన్ని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాయ‌ని ఈ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

Tags:    

Similar News