తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడు భరత్ భూషణ్
2024-2026 సీజన్‌కి తెలుగు ఫిలించాంబర్ కొత్త కార్యవర్గం ఎన్నికైంది.
2024-2026 సీజన్‌కి తెలుగు ఫిలించాంబర్ కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఎప్పటిలానే ఇరు వర్గాల ప్యానెల్స్ పోటీపడగా అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ప్రత్యర్థి ప్యానెల్ తరపున అధ్యక్ష పదవి రేసులో పోటీ చేసిన ఠాగూర్ మధుపై ఆయన గెలుపొందారు. అశోక్ కుమార్ - వైవియస్ చౌదరి నడుమ జరిగిన పోటీలో అశోక్ కుమార్ గెలుపొంది ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. కొత్తగా ఎన్నికైన ఫిలింఛాంబర్ పూర్తి కార్యవర్గం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
గత ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. వాణిజ్య మండలిలో 1600 మంది సభ్యులు ఉన్నారు. వారి సంక్షేమం సహా హౌసింగ్ స్కీమ్స్ వంటి వాటిని నెరవేర్చేందుకు, సీనియర్ సభ్యుల సంక్షేమానికి కొత్త అధ్యక్షుడు కృషి చేయాల్సి ఉంటుంది.
పరిశ్రమ పురోగతికి ప్రస్తుత కార్యవర్గం కృషి చేయాల్సి ఉంటుంది. చిన్న సినిమా అభివృద్ధికి ఛాంబర్ తరపున కృషి చేస్తామని గతంలో దిల్ రాజు అన్నారు. ఇప్పుడు కూడా చిన్న సినిమా ఎదుగుదలకు కృషి జరగాలి. నిర్మాతల సెక్టార్, స్టూడియో సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, ఎగ్జిబిటర్ సెక్టార్ల నుంచి సభ్యులు ఫిలింఛాంబర్ లో మెంబర్లుగా కొనసాగుతారు. వారంతా ఓటింగ్‌లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే.