నష్టాలు 'రాజా సాబ్' పూడుస్తాడు.. నిర్మాత ధీమా!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థగా ఎదిగిన సంగతి తెలిసిందే.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థగా ఎదిగిన సంగతి తెలిసిందే. పరిశ్రమ అగ్ర కథానాయకులందరితో వరుసగా సినిమాలను ప్లాన్ చేస్తోంది ఈ బ్యానర్. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చివరి చిత్రం `మిస్టర్ బచ్చన్` పెద్ద ఫ్లాప్‌గా మిగిలింది. రవితేజ నటించిన ఈ చిత్రానికి నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ పెట్టుబడులు పెట్టారు. ఫ్లాప్ కారణంగా నష్టాలను చవిచూశారనే ప్రచారం సాగింది.
అయితే తాను ఏం చేసినా దానికి పర్ఫెక్ట్ లెక్కలు ఉంటాయని ధీమాగా చెప్పుకునే టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు నష్టాలను పూడ్చేందుకు రెమిడీతో ముందుకు వస్తున్నారు. తన కొత్త చిత్రం టీజర్ లాంచ్‌లో ఇదే విషయం గురించి విలేకరులు ప్రశ్నించారు. దానికి టిజి విశ్వ ప్రసాద్ సమాధానం ఇవ్వడానికి సిగ్గుపడలేదు.. మొహమాటపడలేదు.
మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినందుకు నేను కూడా నిరాశ చెందాను. కానీ ఇటీవలి కాలంలో మనం ఎదుర్కొన్న నష్టాలన్నింటినీ ప్రభాస్ `ది రాజా సాబ్` భర్తీ చేసేస్తాడు! అని విశ్వ ప్రసాద్ ధీమాను కనబరిచారు. ప్రభాస్ సినిమాపై అతడు పూర్తి ధీమాగా ఉన్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పూర్తిగా విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. అతడి స్టైలిష్ ఛామింగ్ లుక్ ని ఇంతకుముందు విడుదల చేయగా దానికి అద్భుత స్పందన వచ్చింది. వచ్చే ఏడాది విడుదల కానున్న `ది రాజా సాబ్` ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.
ప్రభాస్ లాంటి అగ్ర హీరోతో సినిమా చేస్తున్న టీజీ యువహీరోలకు తన బ్యానర్లో అవకాశాలిస్తున్నారు. ఇప్పుడు శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో తన కొత్త చిత్రం `స్వాగ్`ని సిద్ధం చేసారు. స్వాగ్ టీజర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం యువహీరో శ్రీవిష్ణు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.