దళపతి 69: పార్టీలను కెలక్కుండా ప్రజాస్వామ్యంపై తీస్తాడా?
కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగంతో రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు దళపతి తన 69వ చిత్రం పూర్తి చేస్తాడు.
తమిళ నటుడు విజయ్ త్వరలో తన సినీ కెరీర్‌ను వదులుకుని రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. అతడి చివరి చిత్రం గురించి మరింత తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం సాయంత్రం KVN ప్రొడక్షన్స్ ఈ చిత్రం తారాగణం, టెక్నీషియన్స్ గురించి వివరాలను షేర్ చేసింది. పోస్టర్ చూడగానే, ప్రజాస్వామ్యానికి దివిటీ వెలిగించేవాడు! అనే అర్థం స్ఫురించింది. కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగంతో రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు దళపతి తన 69వ చిత్రం పూర్తి చేస్తాడు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీనికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తారని కూడా పోస్టర్ లో ప్రకటించారు. అక్టోబర్ 2025న ఈ సినిమా విడుదలవుతుందని కూడా తెలిపారు. తమిళనాడు రాజకీయాలపై దళపతి సంధించే బ్రహ్మాస్త్రం ఈ సినిమా అన్న చర్చ సాగుతోంది. కానీ విజయ్ తన చివరి చిత్రంలో రాజకీయాలను టచ్ చేయకూడదని దర్శకుడికి చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. దీనర్థం.. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించకుండానే, ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో చూపిస్తారా? అన్నది చూడాలి.
విజయ్ ఇటీవల వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'లో కనిపించాడు. ఇది సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపించాడు. తండ్రిగా కొడుకుగా కూడా నటించాడు. సినిమాకి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా కానీ, తమిళనాడు బాక్సాఫీస్ వద్ద 180 కోట్లతో ఓవరాల్ గా 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇది దళపతికి మరో గొప్ప విజయం. విజయ్‌తో పాటు, ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవా, వైభవ్, అజ్మల్ అమీర్, మోహన్, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్, లైలా, మీనాక్షి చౌదరి, యోగి బాబు, స్నేహ, యుగేంద్రన్, ప్రేమి అమరేన్, వీటీవీ గణేష్ తదితరులు ఇందులో నటించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సంఘం ఈ ఏడాది సెప్టెంబర్‌లో అధికారిక పార్టీగా పేరును నమోదు చేసింది. దీంతో విజయ్ రాజకీయాలపై పూర్తి స్పష్ఠత వచ్చేసింది. హెచ్.వినోద్ తో 69వ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగుతాడు. 2026 తమిళనాడు ఎన్నికల్లో దళపతి ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.