రియ‌ల్ పొలిటిక‌ల్ ఎంట్రీకి ముందే....రీల్ ఎంట్రీ!

'విజ‌య్ 69 కమర్షియల్ అంశాలతో 200% దళపతి విజయ్ సినిమా అవుతుంది. అన్ని వయసుల వారు , రాజకీయ పార్టీలు ఈ చిత్రాన్ని చూస్తారు.

Update: 2024-08-17 06:59 GMT

త‌ల‌ప‌తి విజ‌య్ 2026 ఎన్నిక‌ల్లో తమిళ‌నాడు నుంచి బ‌రిలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. 'తమిళ్ వెట్రి కళగం' పేరుతో ఇప్ప‌టికే పార్టీని స్థాపించి జ‌నాల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇంకా పూర్తి స్థాయిలోకి రంగంలోకి దిగ‌లేదు. మ‌రో రెండు సినిమాల అనంత‌రం ప్ర‌జాక్షేత్రంలోకి వెళ్తారు. ఇప్ప‌టికే దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హాలో పాద యాత్ర‌తో జ‌నాల్లోకి వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

 

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని పాద యాత్ర ద్వారా తెలుసుకోవాల‌ని విజ‌య్ సంక‌ల్పించిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి అత‌డి రాజ‌కీయ ప్ర‌ణాళిక ఎలా ఉంద‌న్న‌ది అధికారికంగా రివీల్ చేస్తే త‌ప్ప క్లారిటీ రాదు. అయితే అంత‌కంటే ముందే విజ‌య్ రాజ‌కీయాన్ని త‌న సినిమా ద్వారా ప్రేక్ష‌కాభిమానుల్లోకి తీసుకెళ్లే ప్ర‌ణాళిక‌తో ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య్ హీరోగా వెంక‌ట్ ప్ర‌భు 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో విజ‌య్ రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే 'ఖాకీ' ద‌ర్శ‌కుడు హెచ్. వినోధ్ తో త‌న చిర‌వి సినిమా చేస్తాడు విజ‌య్. ఇప్ప‌టికే స్టోరీ కూడా లాక్ అయింది. యాక్ష‌న్ సినిమాల్లో వినోద్ ఓ బ్రాండ్ గా పేరుగాంచాడు. అత‌డి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎంతో మంది ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నా విజ‌య్ ...వినోధ్ కి మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో రాజ‌కీయ అంశాల్ని ట‌చ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వినోద్ దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాడు.

'విజ‌య్ 69 కమర్షియల్ అంశాలతో 200% దళపతి విజయ్ సినిమా అవుతుంది. అన్ని వయసుల వారు , రాజకీయ పార్టీలు ఈ చిత్రాన్ని చూస్తారు. అలాగని ప్ర‌త్య‌కంగా ఏ పార్టీనీ గానీ, నాయ‌కుడిని గానీ ట‌చ్ చేయ‌లేదు. రాజకీయ నాయకులను కించపరచకుండా లైట్ ఎలిమెంట్స్ ఉంటాయి' అని అన్నారు. దీంతో విజ‌య్ రాజ‌కీయ ప్ర‌వేశానికి ముందే చివ‌రి సినిమాతో రాజ‌కీయం మొద‌లు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News