మూడు తెలుగు సినిమాలకు అతడితో గట్టి పోటీ..!
ఆ మూడు సినిమాలకు పోటీ అన్నట్లుగా తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం తంగలాన్ విడుదల అవ్వబోతుంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో విడుదల వాయిదా వేయడం జరిగింది. పుష్ప రాకపోవడంతో మూడు తెలుగు సినిమాలు అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఆ మూడు సినిమాలకు పోటీ అన్నట్లుగా తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం తంగలాన్ విడుదల అవ్వబోతుంది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్, రామ్ హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మరియు ఆయ్ సినిమాలు ఆగస్టు 15న రాబోతున్నాయి.
సాధారణంగా తెలుగు సినిమాలు విడుదల ఉన్న సమయంలో తమిళ సినిమాలకు పెద్దగా బజ్ ఉండదు. అది కాకుండా క్రేజీ తెలుగు సినిమాలు విడుదల అవుతున్న సమయంలో అసలు తమిళ సినిమాల గురించి ఎలాంటి చర్చ జరగదు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ మరియు ఆయ్ సినిమాల గురించి ఎంతగా చర్చ జరుగుతోందో అదే స్థాయిలో తంగలాన్ గురించి చర్చ జరుగుతోంది. విక్రమ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు కష్టపడి ఈ సినిమా ను చేశాడు. విభిన్న చిత్రాల దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
తమిళనాట భారీ స్థాయిలో తంగలాన్ కి అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మూడు తెలుగు సినిమాలు ఉన్నా కూడా తంగలాన్ కి మంచి థియేటర్లు లభించే అవకాశాలు ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ కి అత్యధిక థియేటర్లు దక్కుతాయనే వార్తలు వస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ మూవీ స్థాయిలో తంగలాన్ కి థియేటర్లు లభిస్తే కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత కొన్ని సంవత్సరాల్లో అతి తక్కువ తమిళ డబ్బింగ్ సినిమాలు మినిమం విజయాలను సొంతం చేసుకున్నాయి. తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే తప్ప తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు వసూళ్లు నమోదు అవుతున్నాయి. కనుక తంగలాన్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.
మూడు తెలుగు సినిమాలకు పోటీగా తంగలాన్ విడుదల అవ్వబోతుంది. డబ్బింగ్ సినిమా అయినా కూడా తంగలాన్ మా సినిమాలకు కచ్చితంగా గట్టి పోటీ అంటూ ఆయా మూడు సినిమాల మేకర్స్ భావిస్తూ ఉంటారు. మరో రెండు రోజుల్లో నాలుగు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ మొదలు అవ్వబోతుంది. ఆ బాక్సాఫీస్ వార్ లో ఎవరిది పై చేయి అయ్యేనో చూడాలి.