షారుక్‌ కు బెదిరింపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇందులో భాగంగా... చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ అందాయని.. ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌ కు తరచూ డెత్ నోట్స్ రావడం మొదలయ్యాయని తెలుస్తుంది.

Update: 2023-10-09 07:33 GMT

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ నటంచిన తాజా చిత్రం.. "జవాన్" బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ప్రవాహం ఇంకా కొనసాగుతుందని అంటున్నారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ కలెక్షన్లు ఇంకా తగ్గలేదు. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 1,100 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ ఇది.

ఇదే సమయంలో గత సినిమా "పఠాన్" కూడా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టించింది. ఆ సినిమా కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను దాటింది. ఆ సంగతి అలా ఉంటే... ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ గా రికార్డులు సృష్టించిన అనంతరం షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ అందాయని.. ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌ కు తరచూ డెత్ నోట్స్ రావడం మొదలయ్యాయని తెలుస్తుంది. దీంతో షారుఖ్ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. తనకు వస్తోన్న బెదిరింపు కాల్స్‌ దృష్ట్యా మరింత భద్రత కల్పించాల్సిందిగా షారుక్‌ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇందులో భాగంగా షారుక్‌ కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. ఈ క్రమంలో... ఇప్పటివరకూ ఉన్న దాన్ని "వై-ప్లస్‌ కేటగిరీ"గా మారుస్తూ ప్రకటన చేసింది. మహారాష్ట్ర హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. షారుఖ్ కోసం ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బంది పనిచేస్తారు. వారు మూడు షిఫ్టుల్లో ఆయనకు భద్రత కల్పించనున్నారు.

కాగా... ఈ ఏడాది ప్రారంభంలో 25 జనవరి 2023న థియేటర్లలో విడుదలైన "పఠాన్" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1,050 కోట్లను రాబట్టింది. ఇదే క్రమంలో ఈ ఏడాది షారుఖ్ రెండో సినిమా "జవాన్" కూడా "పఠాన్" రికార్డును బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 1,100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో... ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా "జవాన్" నిలిచింది.

ఒకే ఏడాదిలో విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా రికార్డులను సృష్టించాయి. ఈ రెండు సినిమాల విజయం తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని షారుక్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ రెండు బ్లాక్ బాస్టర్స్ తర్వాత, షారుక్‌.. "డంకి" అనే సినిమా చేస్తున్నాడు. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అది కూడా భారీ హిట్ అయితే... ఒకే ఏడాదిలో షారుఖ్ వెయ్యి కోట్ల సినిమాల హ్యాట్రిక్ కొట్టినట్లే!! దీంతో అభిమానులు ఈసినిమాపైనా భారీ ఆశలు, అంచనాలు పెట్టేసుకున్నారు.

Tags:    

Similar News