కల్ట్ మూవీ డిసైడ్ చేసేది ఎవరు..?
ఎవరైనా గుర్తించనిదే ఇది గొప్పది అని నిర్ధారించడం కష్టం కానీ ప్రేక్షకులు ఆల్రెడీ తమ ఫలితం తెలిపాక దాన్ని మరింత ఎంకరేజ్ చేసేలా చేయడం మన దర్శకులకే చెల్లుతుంది.
పొరుగింటి పుల్లకూర ఎప్పుడు రుచిగానే ఉంటుందని తెలుగు సామెత ఉంది కదా.. అఫ్కోర్స్ అది పుల్ల కూర కాదు మంచి కూర అయినా కూడా మన ఇంట్లో దాంతో పోల్చి దాన్ని అద్భుతం అమోఘం అనడం కామనే. ఇది అంతటా ఉన్నదే కానీ ఇది బాగా సినిమా పరిశ్రమకు అన్వయిస్తూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులు మంచోళ్లు.. కంటెంట్ ఉన్న సినిమా వస్తే చాలు తెలుగు ఆడియన్స్ దాన్ని వారి భుజాన మోస్తారు ఇది అందరు చెప్పే మాటే. కానీ ప్రేక్షకులతో పాటుగా ఆ బాధ్యతని కొందరు దర్శకులు కూడా మోస్తారన్నది విశ్లేషకుల మాట.
ఎవరైనా గుర్తించనిదే ఇది గొప్పది అని నిర్ధారించడం కష్టం కానీ ప్రేక్షకులు ఆల్రెడీ తమ ఫలితం తెలిపాక దాన్ని మరింత ఎంకరేజ్ చేసేలా చేయడం మన దర్శకులకే చెల్లుతుంది. ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికోసం అంటే గత శుక్రవారం రిలీజైన ఒక తమిళ డబ్బింగ్ సినిమాను తెలుగులో లీడింగ్ లో ఉన్న దర్శకులు అద్భుతం అమోఘం కల్ట్ మూవీ అనేశారు. కానీ అదే రోజున రిలీజైన తెలుగు హీరో సినిమాను మాత్రం పట్టించుకోలేదు.
వీళ్లకు అంతగా డబ్బింగ్ సినిమా నచ్చితే ఒక ట్వీట్ చేయవచ్చు కానీ ప్రెస్ మీట్ కి వచ్చి మరీ సినిమాను పొగిడేశారంటే ఏమని అనుకోవాలో. ఓ పక్క సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్నాడు. ఆ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఏ దర్శకుడు ఆ సినిమా గురించి మాట్లాడలేదు. ఆ సినిమాకు వచ్చిన ఆ కొంత టాక్ ని కూడా పోగొట్టేలా తమిళ డబ్బింగ్ సినిమాను మోస్తున్నారు.
ఇదే కాదు రీసెంట్ గా రిలీజైన మరో సినిమాకు ఇదే సీన్ రిపీట్ అయ్యింది. మాస్ ఇమేజ్ ఉన్న ఆ హీరో గోదావరి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ కథతో సినిమా తీస్తే దర్శకుల నుంచి ఎలాంటి ప్రశంసలు రాలేదు. ఇలా సొంత భాష సినిమాలకు నోరు తెరవని కొందరు దర్శకులు డబ్బింగ్ సినిమాలు బాగున్నాయ్ అంటే చాలు ఆహా ఓహో అనుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ లో పాల్గొంటారు. మరి ఇదే ఎంకరేజ్ మెంట్ తెలుగు సినిమాలకు ముఖ్యంగా కష్టపడి చేస్తున్న చిన్న సినిమాలకు కూడా ఉంటే బాగుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇతర భాషల సినిమాలు వచ్చి ప్రేక్షకులను మెప్పించినప్పుడు ఇలా బయటకు వచ్చి మాట్లాడే దర్శకులు ప్రతి వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమాల్లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రెస్ మీట్లకు రాకపోయినా జస్ట్ ట్వీట్ చేసినా సరిపోతుంది కదా అని అభిప్రాయ పడుతున్నారు ప్రేక్షకులు. ఆ డబ్బింగ్ సినిమాల అంత టాక్ రాకపోయినా పర్వాలేదు అని టాక్ తెచ్చుకున్న తెలుగు సినిమాలకు ఎంకరేజ్ మెంట్ గా ఒక ట్వీట్ చేస్తే తెలుగు పరిశ్రమకు కాస్త కూస్తో మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. సినిమాకు పడే కష్టం అందరికీ ఒకేలా ఉంటుంది. కానీ ఫలితం మాత్రం కొందరికే దక్కుతుంది. ఐతే తమ చేతుల్లో ఉన్న ఈ కొద్దిపాటి ఎంకరేజ్మెంట్ వల్ల కొన్ని సినిమాలు ప్రేక్షకుల దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుగు దర్శకులు ఆలోచిస్తే బాగుంటుందని కోరుతున్నారు.