సీనియర్లకు వీళ్లే సరైనోళ్లు!
ఒకప్పుడు ఇండస్ట్రీ కాంబినేషన్లు మీద నడిచేది. స్టార్ హీరోలు ఆ డైరెక్టర్ తోనే సినిమా చేస్తే బాగుంటుంది
ఒకప్పుడు ఇండస్ట్రీ కాంబినేషన్లు మీద నడిచేది. స్టార్ హీరోలు ఆ డైరెక్టర్ తోనే సినిమా చేస్తే బాగుంటుంది. తప్ప క హిట్ వస్తుంది అన్న సెంటిమెంట్ బలంగా పనిచేసేది. దీంతో హీరోలు కూడా వాళ్లకు అంతే ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు చేసేవారు. కానీ నేడు ట్రెండ్ మారిన సంగతి తెలిసిందే. కాంబినేషన్లతో సినిమాలు తీస్తే మార్కెట్ లో పనవ్వదని తర్వాత తరం నటులు రుజువు చేయడంతో సీనియర్లు కూడా మారారు. ఇప్పుడు కొత్త దర్శకులు..కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ సూపర్ సీనియర్ హీరోలు చిరంజీవి-నాగార్జున-బాలకృష్ణ-వెంకటేష్ లాంటి నటులకు ఈ మాస్ డైరెక్టర్లు సెట్ అయినంతగా మరొకరు సెట్ అవ్వడం లేదు.
వీళ్లు ఇస్తోన్న కిక్ మరో దర్శకుడు అంత తేలిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'తులసి' అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత ఆ ఇద్దరు కలిసి సినిమాలు చేయలేదు గానీ చేస్తే! బాగుండు అన్న ఆశ..కోరికలు అభిమానుల్లో ఉన్నాయి. ఇక ఈ మధ్యనే చిరంజీవి-బాబి కలిసి 'వాల్తేరు వీరయ్య'తో మాస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదేమి కొత్త కధ...పాత ఊరమాస్ కథతో తీసిన సినిమా అభిమానులకు కనెక్ట్ అవ్వడంతో హిట్ అయింది.
అలాగే నటసింహ బాలకృష్ణతో అనీల్ రావిపూడి తీసిన 'భగవంత్ కేసరి' కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నాగార్జున మాత్రం ఈ డైరెక్టర్లు ఎవ్వరితోనూ ఇంతవరకూ సినిమా చేయలేదు. బాబి మాత్రం నాగ్ తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడుట. ప్రస్తుతం బాలయ్యతో 109వ సినిమా చేస్తున్నాడు బాబి. ఇది పక్కా మాస్ కంటెంట్ ఉన్న సినిమా. కొత్త దనం ఏమాత్రం ఆశించాల్సిన పనైతే లేదు. బాలయ్య ఇమేజ్ తో మార్కెట్ లో నడిచిపోతుంది. నాగార్జున కూడా సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో బాబితో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం పెద్ద కష్టం కాదు. చిరంజీవి కోసం బోయపాటి కూడా సీరియస్ గానే ట్రై చేస్తున్నాడు. ఇతడి కథలు ఎలా ఉంటాయన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆ కథలకు చిరంజీవి అన్ని రకాలుగా తగ్గవారే. ఇక అనీల్ రావిపూడి మళ్లీ వెంకటేష్ ని తన హీరోగా రిపీట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎఫ్ -2..ఎఫ్ -3 తర్వాత వెంకీతో సోలో మూవీ చేస్తున్నాడిప్పుడు. ఆ రకంగా ఈ కాంబినేషన్లపై మంచి అంచనాలైతే ఉన్నాయి. వీళ్లకు వాళ్లు సరైనోళ్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు.