జనసేనానికి టాలీవుడ్ అగ్రహీరోల విషెస్
టాలీవుడ్ స్టార్ హీరో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు
టాలీవుడ్ స్టార్ హీరో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వంగగీతపై 70,354కు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంతో రాష్ట్రం నలుమూలల నుంచి, టాలీవుడ్ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
PK వీరాభిమాని అయిన యువహీరో నితిన్ అభినందనలు ట్వీట్ చేసిన తొలి టాలీవుడ్ హీరోగా నిలవగా.. గెలుపు వార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్ తదితరులు తమ సోషల్ మీడియాల్లో శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ రోజు జూన్ 6 న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్లు ట్వీట్ల ద్వారా పవన్ ని అభినందించారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అద్భుత విజయం సాధించినందుకు మహేష్ బాబు అభినందనలు తెలిపారు. తన ఎక్స్ ఖాతాలో మహేష్ బాబు ఇలా రాసారు. డియర్ పవన్ కల్యాణ్ .. మీ అద్భుతమైన విజయానికి అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన విశ్వాసానికి మీ విజయం ప్రతిబింబం. ప్రజల కోసం మీ కలలను సాకారం చేయడంలో ఇదే ఉత్సాహంతో ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
మంచు మనోజ్ శుభాకాంక్షలు చెబుతూ.. మా రియల్ పవర్ స్టార్‌కి ప్రత్యేక అభినందనలు.. ఎన్నికల్లో ఘన విజయంతో మరోసారి గేమ్ ఛేంజర్ గా మారారు పవర్ స్టార్. మీ ప్రయాణం ప్రతి ఒక్కరికి నిజమైన స్ఫూర్తినిస్తుంది అన్నా. సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అభినందనీయం. మీ మార్గం మరిన్ని విజయాలు.. ప్రజా సేవతో నిండి ఉండాలి. మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము అన్నా.. అని రాసారు.
నిన్న రామ్ చరణ్ బాబాయ్ పవన్ ని అభినందించారు. ఇది మా కుటుంబానికి గర్వకారణమైన రోజు! అద్భుత విజయం సాధించిన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అని విష్ చేసారు. అద్భుతమైన విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ తపన, కృషి, అంకితభావం, నిబద్ధత ఎల్లప్పుడూ హృదయాన్ని హత్తుకునేవి. ప్రజలకు సేవ చేసేందుకు మీ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రాజకీయ ప్రస్థానం:
పవన్ కళ్యాణ్ 2008లో యువరాజ్యం పేరుతో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే అనారోగ్య కారణాలతో రాజకీయ పనులకు విరామం ఇచ్చారు. 2014లో మళ్లీ పుంజుకున్న ఆయన ఈసారి జనసేన పార్టీ (జేఎస్పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో కలిసి గాజువాక, భీమవరం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన ఒకే ఒక్క అభ్యర్థి విజయం సాధించి, ఆ తర్వాత అధికార పార్టీ వైఎస్సార్‌సీపీలో చేరారు.
2024లో టీడీపీ- ఎన్డీయే ప్రభుత్వంతో చేతులు కలిపి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిగా పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ ఈసారి ప్రమోషన్స్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వేదికలపై డైలాగ్స్ వినిపిస్తూ.. ఎఫెక్టివ్ స్పీచ్‌లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. విజేతగా నిలిచిన పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతి త్వరలో నియోజకవర్గం అతడి పార్టీ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తారు.