ప్రొడక్షన్‌లో అవినీతిపై నిర్మాత పిచ్చ క్లారిటీ
అవినీతి చాలా రూపాల్లో ఉంటుంది. ముఖ్యంగా సినిమాల నిర్మాణంలో అవినీతి పలు దశల్లో సైలెంటుగా కొనసాగుతుంది
అవినీతి చాలా రూపాల్లో ఉంటుంది. ముఖ్యంగా సినిమాల నిర్మాణంలో అవినీతి పలు దశల్లో సైలెంటుగా కొనసాగుతుంది. అయితే నిర్మాతలు దానిని స్వీకరించే విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుందని అన్నారు ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్. ఆయన నిర్మించిన ఈగల్ (రవితేజ హీరో) ఈ శుక్రవారం (ఫిబ్రవరి 9న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో చాలా వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడారు. ఇందులో ప్రొడక్షన్ లో అవినీతి గురించి కూడా ఆయన ప్రస్థావించారు.
ఒక ఉదాహరణను విడమర్చి చెబుతూ.. ఒక్క కారవ్యాన్ విషయంలో అవినీతిని చూస్తే సప్లయర్ తో లాలూచీ పడి ప్రొడక్షన్ మేనేజర్లు ఎలా డబ్బులు నొక్కేస్తారో స్పష్ఠంగా వివరించారు విశ్వప్రసాద్. అవినీతి రకాలు గురించి విశ్వప్రసాద్ వివరిస్తూ -''అవినీతి మూడు రకాలు. మొదట ధరల అవినీతి సాధారణంగా 10-30 శాతం ఉంటుంది. ఆ తర్వాత క్వాంటిటీ అవినీతి.. ఆపై నాణ్యత పరమైన అవినీతిని చూస్తుంటాం. కారవాన్ విషయంలో రూ.500 మేర అవినీతి ఉంటుంది. ఇది మ్యానేజ్ చేసేయగలిగేదే గనుక మేం దానిని విస్మరిస్తాము. 4-6 వాహనాలు అద్దెకు తీసుకుని వస్తే 10 వాహనాలు తీసుకొచ్చామని చెబుతారు. మంచి సౌకర్యాలు ఉన్న కారవాన్‌ను అందించకపోవడం అవినీతిలో మూడవ స్థాయి. అలాంటి కారవాన్‌లు నటీనటుల మానసిక స్థితిని పాడు చేస్తాయి.
ఇది వారి పనితీరు సినిమా మొత్తం నాణ్యతను ప్రభావితం చేస్తుంది.. అని అన్నారు. నిర్మాతలకు 300 ఖర్చవ్వాల్సిన చోట రూ.500 చెబుతారని కూడా అన్నారు. అయితే అవినీతి గురించి తమకు ముందే తెలుసునని, దానిని మ్యానేజ్ చేస్తున్నామని అన్నారు. అవినీతి విషయంలో ఒక్కో నిర్మాత ఒక్కోలా వ్యవహరిస్తారని అన్నారు. అయితే తాను మాత్రం ఫైనల్ ఔట్ పుట్ విషయంలో రాజీకి రానని, ఇలాంటి అవినీతి వ్యవహారాలతో ప్రొడక్షన్ డిస్ట్రబ్ కావడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. ఉదాహరణకు సరైన కారవ్యాన్ ని బుక్ చేయకపోతే .. నాశిరకం సౌకర్యాలున్న కారవ్యాన్ ని బుక్ చేస్తే దానివల్ల సెట్స్ లో ఆర్టిస్టులు డిస్ట్రబ్ అవుతారని అన్నారు. దాంతో పాటే ఔట్ పుట్ కూడా డిస్ట్రబ్ అవుతుంది. అలాంటివి నాకు నచ్చవు.. అని అన్నారు.
క్వాలిటీ ఔట్ పుట్ కోసం 500 ఖర్చు చేయాల్సిన చోట రూ.5000 ఖర్చు చేయడానికైనా నేను వెనకాడను. పెట్టుబడుల్ని సౌకర్యంగా పెడతాను.. అస్సలు రాజీకి రాలేను! అని అన్నారు. తనకు మంచి నాణ్యమైన ఔట్ పుట్ కావాలని కూడా అన్నారు. సినిమాల నిర్మాణంలో ఇలాంటి లోటుపాట్లను అవినీతి గురించి మాట్లాడిన తొలి నిర్మాత విశ్వప్రసాద్ అనడంలో సందేహం లేదు.