టాలీవుడ్ డబ్బులు.. కోలీవుడ్ హీరోలు
టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మూవీస్ చేస్తున్న పెద్ద నిర్మాతలు అందరూ తమ ప్రొడక్షన్ లని అన్ని భాషలకి విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు
టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మూవీస్ చేస్తున్న పెద్ద నిర్మాతలు అందరూ తమ ప్రొడక్షన్ లని అన్ని భాషలకి విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితం కాకుండా మార్కెట్ స్కోప్ ఉన్న అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేయడం ద్వారా పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉన్నారు.
ఒకప్పుడు బాలీవుడ్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా ఇప్పుడు టాలీవుడ్ ధీటుగా టాప్ లో కొనసాగుతోంది. ఇక టాలీవుడ్ తర్వాత అతి పెద్ద మూవీ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ అంటే కోలీవుడ్ అని చెప్పాలి. అందుకే మన బడా నిర్మాతలు అందరూ కోలీవుడ్ హీరోలతో మూవీస్ నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ లో సంపాదించుకున్న డబ్బుతో కోలీవుడ్ హీరోలపై పెట్టుబడులు పెట్టి మరింత లాభపడేందుకు సిద్దమవుతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా మార్కెట్ పెంచుకోవడం కోసం ఇతర భాషలకి చెందిన దర్శకులు, నిర్మాతలతో మూవీస్ చేయడానికి పచ్చజెండా ఊపుతున్నారు. ఇళయదళపతి విజయ్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు మూవీ రెండు భాషలలో చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.
దిల్ రాజు మళ్ళీ విజయ్ తోనే చేయాలని అనుకున్న అతను రాజకీయాలలోకి వెళ్లడంతో ఈ కాంబినేషన్ సెట్ కావడం లేదు. అయితే దళపతి విజయ్ అనూహ్యంగా తన చివరి సినిమా టాలీవుడ్ బడా నిర్మాత డివివి దానయ్యతో చేస్తూ ఉండటం విశేషం.
ఈ సినిమాకి కెరియర్ లో అత్యధిక రెమ్యునరేషన్ ని విజయ్ అందుకోబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ తలా అజిత్ 63వ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోంది. ధనుష్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ సర్ మూవీ నిర్మించి హిట్ అందుకుంది. ఇప్పుడు ఏషియన్ నిర్మాతలు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమాని నిర్మిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్ శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అరవింద్ సూర్య డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కోలీవుడ్ అగ్ర హీరోలతో టాలీవుడ్ కి చెందిన నిర్మాణ సంస్థలు టై అప్ అవుతూ ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే స్టూడియో గ్రీన్, లైకా ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు టాలీవుడ్ అగ్ర హీరోలతో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.