టాలీవుడ్‌పై గౌరవం పెరిగింది.. ఇదిగో ప్రూఫ్..
ఇంతకుముందు ఇరుగు పొరుగు భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించిన చాలా మంది అగ్ర తారలు సినిమా పూర్తయాక ఇటువైపు చూసేవారు కాదు.
తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. పాన్ ఇండియా/వరల్డ్ సినిమాలతో టాలీవుడ్ సత్తా చాటుతోంది. ఆస్కార్ - గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలతో తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఒకప్పుడు ఫక్తు మసాలా ఫార్ములా సినిమాలు తీసేవారనే విమర్శ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. తెలుగు పరిశ్రమలో చేస్తున్నన్ని ప్రయోగాలు భారతదేశంలో మరే పరిశ్రమ చేయలేదు అనే స్థాయికి అడుగులు పడ్డాయి. కంటెంట్.. ప్రచారం.. టెక్నాలజీ పరంగా టాలీవుడ్ చాలా ఎత్తులకు ఎదిగింది. అందుకేనేమో ఇటీవలి కాలంలో తెలుగు సినీపరిశ్రమకు అపారగౌరవం దక్కుతోంది. దేశంలోని ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటుల నుంచి బోలెడంత గౌరవం ఆప్యాయత కనిపిస్తోంది.
ఇంతకుముందు ఇరుగు పొరుగు భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించిన చాలా మంది అగ్ర తారలు సినిమా పూర్తయాక ఇటువైపు చూసేవారు కాదు. ఎవరి పారితోషికం వారు అందుకుని గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. తెలుగు సినిమాల్లో తమ పాత్రలకు తామే స్వయంగా డబ్బింగులు చెప్పుకుంటున్నారు. తెలుగు రాకపోయినా నేర్చుకుని మరీ డబ్బింగ్ చెబుతున్నారు. దీంతో పాటు ప్రమోషనల్ కార్యక్రమాల్లోను పాల్గొంటూ తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు.
నిజానికి ఇది పరిశీలించదగిన పరిణామం. మొన్నటికి మొన్న భగవంత్ కేసరి ప్రమోషనల్ కార్యక్రమాల్లో బాలకృష్ణ తన సినిమా విలన్ అర్జున్ రాంపాల్ ఎంతో ఒదిగి ఉండే నటుడని, తన పాత్ర కోసం తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పుకుంటున్నాడని తెలిపారు. అర్జున్ రాంపాల్ యాక్సెంట్ ఎలా ఉంటుందో వినాలన్న ఆసక్తి కలిగింది. అలాగే విక్టరీ వెంకటేష్ సైంధవ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖి విలన్‌గా కనిపించనున్నాడు. ఇంతకుముందు రిలీజైన టీజర్ లో అతడి పాత్ర తీరుతెన్నులు ఆసక్తిని పెంచాయి. నవాజ్ తెలుగు నేర్చుకుని యాసను పలికే తీరు చాలా యూనిక్ గా ఉంటుందని టీజర్ చూస్తే వెల్లడైంది. సైంధవ్ సినిమాలో విలక్షణమైన హైదరాబాదీ యాసలో మాట్లాడనున్న నవాజుద్దీన్ సిద్ధిఖీ హిందీలో అగ్రహీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఒకప్పుడు అమ్రిష్ పురి లాంటి పాపులర్ హిందీ నటుడు టాలీవుడ్ లో విలనీ చేసారు. ఆయన తెలుగు నేర్చుకుని మరీ తనదైన యాసతో తెలుగు మాట్లాడి అలరించారు. అమ్రిష్ పురి తెలుగు యాక్సెంట్ కి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అలాగే ప్రభాస్ -నాగ్ అశ్విన్ ల `కల్కి` చిత్రంలో నటిస్తున్న కొందరు ఇరుగు పొరుగు తారలు కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల చాలామంది పొరుగు భాషా నటీనటులు స్థానిక డబ్బింగ్ ఆర్టిస్టులపైనే ఆధారపడ్డారు. దానివల్ల వారికి ఆశించినంత గుర్తింపు కూడా దక్కలేదు. ఇప్పుడు మళ్లీ అర్జున్ రాంపాల్- నవాజుద్దీన్ లాంటి స్టార్లు దీనిని మార్చే ప్రయత్నం చేస్తున్నారని భావించాలి.