సీనియర్ హీరోలకు ఆడియన్స్ వార్నింగ్ బెల్స్!
నేటి జనరేషన్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా వందల కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి
మార్కెట్ లో కటౌట్ కంటే కంటెంట్ కే ప్రేక్షకులు పెద్ద పీట వేస్తోన్న సంగతి తెలిసిందే. పర భాషల సినిమాలు సైతం భారీ విజయం సాధిస్తున్నాయంటే? తెలుగు ఆడియన్స్ కంటెంట్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అద్దం పడుతుంది. ఇప్పటికే ఓ జనరేషన్ హీరోలంతా మారి ప్రేక్షకుల పల్స్ పట్టుకుని సినిమాలు చేయడం మొదలు పెట్టారు. నేటి జనరేషన్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా వందల కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి.
కనీసం ఆ హీరో పేరు కూడా తెలియకుండానే ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నారు. కారణంగా మౌత్ టాక్ తో వచ్చిన పాజిటివ్ టాక్ తోనే ఇది సాధ్యమవుతుంది. ఈ సినారేలో హీరో స్టార్ డమ్ అనేది కేవలం కొంతవరకూ పరిమితమవుతుంది. రాను రాను అది మరింత బలహీనంగా మారుతుంది అనడానికి ఈ సీనియర్ హీరోల్ని ఉదహరించొచ్చు. `ఆచార్య, `భోళా శంకర్` సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి విమర్శలు ఎదుర్కున్నారో తెలిసిందే.
అంత వరకూ ఏనాడు ట్రోలింగ్ గురికాని మెగాస్టార్ సైతం తొలిసారి ట్రోలింగ్ బారిన పడాల్సి వచ్చింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` తో ఓ ఊపు ఊసేసినా ఆ ఇమేజ్ `లాల్ సలామ్` విషయంలో ఎక్కడా పనిచేయలేదు. కనీసం ఓపెనింగ్ కూడా తేలేకపోయిందా చిత్రం. కంటెంట్ లేని సినిమా అని తేలిపోవడంతోనే రజనీ ఇమేజ్ అక్కడ పనిచేయలేదు. ఇక ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `భారతీయుడు-2` ఎలాంటి టాక్ సొంతం చేసుకుందన్నది తెలిసిందే.
వసూళ్ల విషయంలో కోలీవుడ్ కంటే టాలీవుడ్ బెటర్ గా అనిపించింది. అంటే కమల్ హాసన్- శంకర్ సినిమకి సొంత భాష అభిమానులే కనెక్ట్ కాలేదు అన్నది అర్దమవుతుంది. ఇవన్నీ సీనియర్ హీరోలకు ప్రేక్షకులు ఇచ్చిన వార్నింగ్ బెల్స్ లాంటివి. తదుపరి చిత్రాల్లో వీళ్లంతా కంటెంట్ కింగ్ లా ఉండే సినిమాలు చేస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సీనియర్ హీరోలతో పనిచేస్తోన్న దర్శకులపై ఈ ఒత్తిడి తప్పదు. ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర`, రజనీకాంత్ `వెట్టేయాన్`, కమల్ హాసన్ `థగ్ లైప్` ..`ఇండియన్-3` పై ప్రేక్షకుల్లో అంచనాలతో పాటు, దర్శక, హీరోలపై ఒత్తిడి పీక్స్ లోనే ఉంది సుమీ.