సెంచరీ కొట్టిన మీడియం రేంజ్ స్టార్లు!
మహేష్..రామ్ చరణ్..బన్నీ..ప్రభాస్..ఎన్టీఆర్ అంటే వందకోట్లు పక్కా. ఆ వసూళ్లు ఆ స్టార్ హీరోలు ఓపెనింగ్స్ లోనే సాధించే సత్తా ఉన్నవారు
మహేష్..రామ్ చరణ్..బన్నీ..ప్రభాస్..ఎన్టీఆర్ అంటే వందకోట్లు పక్కా. ఆ వసూళ్లు ఆ స్టార్ హీరోలు ఓపెనింగ్స్ లోనే సాధించే సత్తా ఉన్నవారు. ఇప్పటికే ఆ హీరోల నుంచి రిలీజ్ అయిన చాలా సినిమాలు వందల కోట్లు వసూళ్లు సాధించాయి. ఆ తర్వాత లిస్ట్ లో ఉన్న సెంచరీ స్టార్లు ఎవరు? అంటే ప్రధానంగా వీళ్లే కనిపిస్తారు. నేచురల్ స్టార్ నాని `దసరా` సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. అప్పటివరకూ ఎన్నో సినిమాలు చేసాడు కానీ ఏ సినిమాతో సాధ్యంకాని వసూళ్లు `దసరా`తోనే సుసాధ్యం చేసి చూపించాడు.
ఇక రౌడీబోయ్ గా ఫేమస్ అయిన విజయ్ దేవరకొండ `గీతగోవందం` సినిమాతో తొలి సెంచరీ నమోదు చేసాడు. ఇతడికి సెంచరీ కొట్టడానికి పెద్దగా సమయం పట్టలేదు. మూడవ సినిమాతో అర్జున్ రెడ్డితో 50 కోట్ల క్లబ్ లో చేరితే..ఆరవ సినిమా `గీతగోవిందం`తో 100 కోట్ల క్లబ్ లోనూ చేరాడు.ఇక మెగా వారసుడు వరుణ్ తేజ్ `ఎఫ్ -2` సినిమాతో వంద కోట్లు సాధించాడు. అయితే ఈ క్రెడిట్ అంతా అతనికే సొంత కాదు. అందులో సగం విక్టరీ వెంకటేష్ సొంతం.
ఇద్దరు కలిసి నటించిన సినిమా అది. అలాగే సీనియర్ హీరో అయిన రవితేజ కి కూడా సెంచరీ కొట్టడానికి దశాబ్ధాలు సమయం పట్టింది. `ధమాకా` సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక యంగ్ హీరో నిఖిల్ `కార్తికేయ-2` తో పాన్ ఇండియాలో ఫేమస్ అవ్వడమే కాకుండా వంద కోట్లు సాధించిన యువ స్టార్ గా రికార్డు సాధించాడు. అలాగే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఏకంగా తొలి సినిమాతోనే సెంచరీ కొట్టాడు. అదే `ఉప్పెన`. దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభతోనే అది సాధ్యమైంది.
ఇప్పుడు ఈ సీనియర్ హీరోల సరసన ఇద్దరు యువ హీరోలు కూడా చేరారు. వారే తేజ సజ్జ..సిద్దు జొన్నలగడ్డ. తేజ `హనుమాన్` సినిమాతో పాన్ ఇండియాలో ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ఆ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. హీరోగా నటించిన మూడవ సినిమాతోనే ఆ రికార్డు సాధించాడు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన `టిల్లుస్వ్కేర్` తో సిద్దు జొన్నలగడ్డ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. వారం రోజుల్లోనే ఈ రికార్డు సృష్టించాడు. ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఆ రకంగా టైర్ -2 హీరోల్లో సెంచరీ కొట్టిన స్టార్లు ఎవరంటే? ఈ ఎనిమిది మందిని హైలైట్ చేయోచ్చు.