టాప్ స్టోరి: అపజయమెరుగని దర్శక దిగ్గజాలు
తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక మైలురాయిగా మారితే, అపజయం అన్నదే చూడకపోతే.. అలాంటి దర్శకులను వేళ్ల మీద మాత్రమే లెక్కించగలం
తెరకెక్కించిన ప్రతి సినిమా ఒక మైలురాయిగా మారితే, అపజయం అన్నదే చూడకపోతే.. అలాంటి దర్శకులను వేళ్ల మీద మాత్రమే లెక్కించగలం. సక్సెస్ రేటు కేవలం 5-10 శాతం మాత్రమే ఉండే సినీపరిశ్రమల్లో వరుస విజయాలు సాధిస్తూ అసాధారణ దర్శకులుగా గుర్తింపు పొందిన టాప్ 5 దర్శకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఇలాంటి దర్శకులు చాలా అరుదు.
ఎస్.ఎస్. రాజమౌళి
టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి పేరు మార్మోగుతోంది. దర్శకధీరుడు మొత్తం 12 సినిమాలు తెరకెక్కించగా అన్ని సినిమాలు విజయం సాధించాయి. ఇందులో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిస్టారికల్ హిట్లు ఉన్నాయి. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి కెరీర్ లో పాన్ ఇండియా విజయాలతో అసాధారణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మగధీర- బాహుబలి-బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో అతడి స్థాయి పాన్ వరల్డ్ రేంజుకు ఎదిగింది. భవిష్యత్ లో హాలీవుడ్ ని కొట్టే సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడిగా, కామెరూన్, నోలాన్ వంటి ప్రముఖుల మెప్పు పొందిన ఏకైక భారతీయ దర్శకుడిగా అతడి స్థాయి అసమానంగా ఎదిగింది. తదుపరి మహేష్ కి పాన్ ఇండియా హిట్ ఇవ్వడమే లక్ష్యంగా రాజమౌళి పని చేస్తున్నారు. 100 కోట్లు పారితోషికం, అదనంగా లాభాల్లో వాటా అందుకునే దర్శకుడిగా రాజమౌళి నేడు ఎదిగారు. భారతదేశంలో రెండు సార్లు 1000 కోట్ల క్లబ్ అందుకున్న దర్శకుడిగా రాజమౌళి పేరు మార్మోగుతోంది.
అట్లీ కుమార్
దక్షిణ భారతదేశంలో రాజమౌళి తర్వాత మళ్లీ అపజయమెరుగని దర్శకుడు ఎవరు? అంటే తమిళ దర్శకుడు అట్లీ పేరు మార్మోగుతోంది. జవాన్ ఘనవిజయంతో అతడి పేరు దేశవ్యాప్తంగా వెలిగిపోతోంది. తమిళ అగ్రహీరో , దళపతి విజయ్ కి హ్యాట్రిక్ విజయాల్ని అందించిన దర్శకుడిగా అట్లీ క్రేజ్ స్కైని టచ్ చేసింది. అట్లీ ఒక్కో సినిమాకి 50కోట్లు అందుకుంటున్నాడని కథనాలొచ్చాయి. ఇక షారూఖ్ తో పని చేయడం కోసం అతడు పారితోషికం తగ్గించుకున్నాడని కూడా కథనాలొచ్చాయి. ఇకపై 50కోట్లు పైబడి పారితోషికం అందుకునేవాడిగా అతడి పేరు జాబితాలో ఉంది. అట్లీ 5 సినిమాలు తీసాడు. రాజా రాణి, తేరి, మెర్సల్, బిగిల్, జవాన్ చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్నాడు. ఇందులో తేరి- మెర్సల్- బిగిల్ చిత్రాల్లో దళపతి విజయ్ నటించిన సంగతి తెలిసిందే. మునుముందు విజయ్- అట్లీ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇకపైనా అట్లీ తన సక్సెస్ స్ట్రీక్ ని ఇలాగే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
రాజ్ కుమార్ హిరాణీ:
ఇక ఉత్తరాది దర్శకుల్లో రాజ్ కుమార్ హిరాణీకి అపజయమెరుగని దర్శకుడిగా గుర్తింపు ఉంది. హిరాణీ ప్రత్యేకత ఉన్న సీనియర్ దర్శకుడు. ఆయన తన కెరీర్ లో పరిమితంగా సినిమాలను తెరకెక్కించగా ప్రతిదీ సంచలన విజయాలు సాధించాయి. మున్నా భాయ్ M.B.B.S., లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, PK, సంజు సహా ఐదు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇవన్నీ కమర్షియల్ సక్సెస్ సాధించడమే గాక, విమర్శనాత్మకంగా గొప్ప పాపులరయ్యాయి. వీటిలో చాలా వరకు జాతీయ అవార్డులు సహా అనేక ఇతర అవార్డులను గెలుచుకున్నాయి. అతడి అవార్డులలో 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. రాజ్‌కుమార్ హిరానీ ఫిల్మ్స్ బ్యానర్ లో అతడు సినిమాలను నిర్మిస్తున్నారు.
తరచుగా బోమన్ ఇరానీని తన సినిమాల్లో ఫన్నీ విరోధిగా చూపిస్తాడు. ఆదర్శవాదం, మానవతావాదాన్ని ప్రోత్సహించే సూక్ష్మ సందేశంతో విద్యా వ్యవస్థ లేదా వ్యవస్థలపై కథలను వివరించే తమాషా వ్యంగ్య మార్గం అతడి విధానం. పదునైన సన్నివేశాలు తెలివైన కామిక్ టైమింగ్ తో మిళితం చేసి సినిమాలు తీయడం హిరాణీ ప్రత్యేకత. లగే రహో మున్నాభాయ్ వంటి అతని సినిమాలు భారతదేశంలో బలమైన సాంస్కృతిక ప్రభావాన్ని కలిగించాయి. గాంధీయిజాన్ని బాగా ప్రచారం చేసాయి. అమీర్ ఖాన్ నటించిన త్రి ఇడియట్స్ మన విద్యా వ్యవస్థలోని లోపాలపై సెటైరికల్ గా సాగింది. దేవునిపై మానవులు ఎక్కువగా ఆధారపడటం అనే సమస్యపై పీకే తెరకెక్కి విజయం సాధించింది. ఇప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ తో డంకీ అనే సినిమా తీస్తున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల వెతలపై చిత్రమిదని తెలుస్తోంది.
కరణ్ జోహార్- అయాన్ ముఖర్జీ
కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కించిన చాలా సినిమాలు ఫ్లాపైనా అతడు దర్శకుడిగా తెరకెక్కించిన సినిమాలేవీ ఫ్లాప్ కాలేదు. డజను సినిమాలకు కరణ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే రాఖీ ఐర్ రాణీకి ప్రేమ్ కహానీ చిత్రంతో లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకుడిగా విజయం దక్కించుకున్నాడు. తన చిత్రాలతో డజను పైగా నటవారసులను అతడు తెరకు పరిచయం చేసాడు. కరణ్ శిష్యుడు అయాన్ ముఖర్జీ - మూడు సినిమాలు తెరకెక్కించగా ప్రతిదీ విజయం సాధించాయి. ఇటీవల విడుదలైన మల్టీవర్స్ మూవీ బ్రహ్మాస్త్ర పెద్ద సక్సెసైంది. ఇందులో వరుసగా సినిమాలు రానున్నాయి.
జేమ్స్ కామెరూన్:
హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ప్రతిదీ ఘనవిజయం సాధించాయి. అతడు తెరకెక్కించిన టైటానిక్ ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లతో సంచలనం సృష్టించింది. అవతార్- అవతార్ 2 చిత్రాలతోను అసాధారణ విజయాలను అందుకున్నాడు. బిలియన్ డాలర్ వసూళ్లు అతడి సినిమాలకు చాలా సహజం.
క్రిస్టోపర్ నోలాన్:
హాలీవుడ్ లో విలక్షణ చిత్రాలతో ఆస్కార్ లు కొల్లగొట్టే టాప్ డైరెక్టర్ గా క్రిస్టోఫర్ నోలాన్ పేరు మార్మోగుతోంది. అతడు తెరకెక్కించిన ప్రతిదీ ఒక సంచలనం. వైవిధ్యం.. అసాధారణమైన మేధోతనంతో కూడుకున్న స్క్రీన్ ప్లేలు అతడి ప్రత్యేకత.
క్రిస్టోఫర్ నోలన్ సినిమాల జాబితా..
1. ది డార్క్ నైట్ (2008) వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ...
2. డన్‌కిర్క్ (2017) వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ / వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ...
3. ది ప్రెస్టేజ్ (2006) బ్యూనా విస్టా పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ...
4. బాట్‌మ్యాన్ బిగిన్స్ (2005) వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ...
5. ఇంటర్ స్టెల్లార్ (2014) పారామౌంట్ పిక్చర్స్ ...
6. ఇన్సెప్షన్ (2010) వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ...
7. మెమెంటో (2000) న్యూమార్కెట్ ఫిల్మ్స్ ...
8. టెనెట్ (2020) వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ...
హాలీవుడ్ లో మెల్ గిబ్సన్ నటుడిగా రాణించాడు. దర్శకుడిగా ఎదురేలేని కెరీర్ ని సాగించాడు. ఇంకా పలువురు దర్శకులు అపజయమెరుగని వారి జాబితాలో ఉన్నా కానీ, చాలా పరిమితంగా మాత్రమే సినిమాలు తీసి ఈ గుర్తింపును తెచ్చుకున్నారు.