నెపో కిడ్స్‌ని రేసులో వెనక్కి నెట్టిన బోల్డ్ బ్యూటీ
ఇటీవల చాలామంది అగ్ర కథానాయికలు వరుసగా పెళ్లిళ్లతో సెటిలైపోవడం కూడా ఈతరం భామలకు కలిసొస్తోంది.
బాలీవుడ్‌లో పాపులర్ కథానాయికలతో పోటీపడుతూ రేసులో నిలదొక్కుకోవాలంటే నేటితరం కథానాయికలు ఎలాంటి ప్రణాళికలతో ఉండాలి?.. దీనికి పక్కా సమాధానం జాన్వీకపూర్ ప్లానింగ్. సాటి నెపో కిడ్స్ అయిన సారా అలీఖాన్, అనన్య పాండే కంటే జాన్వీ తెలివిగా పావులు కదుపుతోంది. ఓవైపు బాలీవుడ్‌లో నటిస్తూనే, మరోవైపు సౌత్‌లో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. నటన పరంగా, డ్యాన్సుల పరంగా జాన్వీ కపూర్ తనదైన ముద్ర వేస్తోంది. బహుశా శ్రీదేవి నటవారసురాలిగా ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ కూడా అదనంగా సహకరిస్తోంది.
అయితే నటవారసులు కానివాళ్లు ఇలాంటి చోట నిలదొక్కుకునేదెలా? అంటే... ఇప్పుడు అందరి కళ్లకు కనిపిస్తున్న బ్యూటీ ట్రిప్తి దిమ్రీ. ఈ భామ ఔట్ సైడర్‌గా బాలీవుడ్‌లో ప్రవేశించినా కానీ వేగంగా ఎదిగేస్తోంది. ఇటీవల వరుసగా క్రేజీ సీక్వెల్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఓవైపు బోల్డ్ పాత్రల్లో నటిస్తూ కావాల్సిన విజయాలను ఖాతాలో వేసుకున్న ట్రిప్తి ఇటీవల యూత్‌ని ఆకర్షించే మరిన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నేటితరంలో అత్యంత బిజీయెస్ట్ కథానాయికగా ట్రిప్తి దూసుకెళుతోంది. అంతేకాదు ఇతర భామలతో పోలిస్తే పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసింది ఈ బ్యూటీ.
ఇటీవల చాలామంది అగ్ర కథానాయికలు వరుసగా పెళ్లిళ్లతో సెటిలైపోవడం కూడా ఈతరం భామలకు కలిసొస్తోంది. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రిప్తీ మరింతగా బిజీ అయిపోతోంది. జాన్వీ, సారా, అనన్య, కియరా లాంటి నేటితరం కాంపిటీటర్స్ తో పోలిస్తే తన ఎంపికలు చాలా డిఫరెంట్ అని కూడా నిరూపిస్తోంది. ఆ ముగ్గురు భామలతో పోలిస్తే ట్రిప్తీ దిమ్రీ డిఫరెంట్ జానర్ లను టచ్ చేస్తోంది. రష్మిక మందన్న లాంటి సౌత్ బ్యూటీ పోటీబరిలో ఉన్నా కానీ, ట్రిప్తీ దిమ్రీకి అది అడ్డంకి కాదు అనడంలో సందేహం లేదు. ఇక ఇమేజ్ సమస్య లేకపోవడం కూడా తనకు పెద్ద ప్లస్ అవుతోంది. చాలామందితో పోలిస్తే సాంప్రదాయక పాత్రల్లో కాకుండా పూర్తిగా బోల్డ్ టచ్ ఉన్న పాత్రలను ట్రిప్తి ఎంపిక చేసుకోవడం ప్లస్ గా మారుతోంది.
బుల్బుల్ - ఖలా వంటి తొలి చిత్రాలలో మంచి నటన కనబరిచిన ట్రిప్తి ఇంతలోనే యానిమల్ - బాడ్ న్యూజ్‌లో గ్లామరస్ పాత్రలతో రక్తి కట్టించింది. తదుపరి భూల్ భులయ్యా 3, ధడక్ 2 వంటి సీక్వెల్ చిత్రాలతో సత్తా చాటుతుందనడంలో సందేహం లేదు. త్వరలో `విక్కీ విద్యా కా వో వాలా` వీడియోలో కనిపించనుంది.