మాయావిని అలా ఆడేశారు!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గుంటూరు కారం రూపంలో తీవ్ర వైఫ‌ల్యాన్ని ఎదుర్కొన్నాడు

Update: 2024-04-09 06:55 GMT

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ గుంటూరు కారం రూపంలో తీవ్ర వైఫ‌ల్యాన్ని ఎదుర్కొన్నాడు. అత‌డు ఫెయిలవ్వ‌డ‌మే గాక సూప‌ర్ స్టార్ మ‌హేష్ వ‌ర‌స విజ‌యాల‌కు బ్రేక్ వేస్తూ ఫ్లాప్ నిచ్చాడు. దీంతో మ‌హేష్ అభిమానులు మాయావిపై గుర్రుమీదున్నారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ స‌క్సెస్ ఈవెంట్ లో అత‌డు క‌నిపించ‌గానే మ‌హేష్ అభిమానులు ఆన్ లైన్ లో చెల‌రేగిపోయారు.

ఒక ఫ్లాప్ డైరెక్ట‌ర్ స‌క్సెస్ ఈవెంట్ లో దేనికి? అంటూ కొంద‌రు నెటిజ‌నులు (మ‌హేష్ ఫ్యాన్స్) ప‌రాచికం ఆడారు. ఆయన ఇంకా పాత ప్రాస‌లో ఇరుక్కుపోయి బ‌య‌టికి రావ‌డం లేదు! నేటిత‌రం దూసుకుపోతుంటే క‌నిపించ‌డం లేదా? అని ఒక నెటిజన్ అభిప్రాయ‌ప‌డ్డారు. కొత్త నీరు వ‌చ్చి పాత నీరు వెళ్లాలి.. అని కూడా కొంద‌రు వ్యాఖ్యానించారు. అమెరికా లాంటి చోట గుంటూరు కారం వ‌సూళ్ల‌ను టిల్లు స్క్వేర్ అధిగ‌మించ‌డాన్ని చూపెడుతూ నేటిత‌రంలా ఆలోచించాల‌ని త్రివిక్ర‌మ్ కి కొంద‌రు సూచించారు. అమెరికాలో అంత పెద్ద ఫ్లాప్ ని చ‌వి చూసిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు స‌క్సెస్ వేదిక‌కు ఎలా వ‌స్తారు? అని కూడా నిలదీశారు.

అదంతా అటుంచితే, ఒక్క‌ ఫ్లాప్ కి అత‌డిని ఇలా నిందించ‌డం స‌రైన‌దేనా? అని ఒక సెక్ష‌న్ ప్ర‌శ్నిస్తోంది. గుంటూరు కారం లాంటి ఫ్లాప్ ని ఇచ్చిన త్రివిక్ర‌మ్ అంతుకుముందు అల వైకుంఠ‌పుర‌ములో లాంటి ఇండ‌స్ట్రీ హిట్ ని ఇచ్చిన విష‌యం మ‌రిచారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. కొన్నిసార్లు ఫ్లాపులు త‌ప్ప‌దు. అంద‌రికీ స‌మాధానం ఇచ్చేలా త్రివిక్ర‌మ్ తిరిగి మ‌రో అద్భుత విజ‌యంతో కంబ్యాక్ అవుతాడంటూ కొంద‌రు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

అత‌డు, ఖ‌లేజా, గుంటూరు కారం రూపంలో మూడు ఫ్లాపులిచ్చాడు మ‌హేష్‌ కి. అందుకే త్రివిక్ర‌మ్ పై ఫ్యాన్స్ కి అంత కోపం. అత‌డు చిత్రం టీవీలో బంప‌ర్ హిట్ట‌యినా కానీ, థియేట‌ర్ల‌లో ఆశించినంత వ‌సూలు చేయ‌లేదు. ఖ‌లేజా బిగ్ ఫ్లాప్. `గుంటూరు కారం` ఓపెనింగులు బావున్నా కానీ ఫ్లాప్ టాక్ వ‌చ్చింది. బ‌న్నీకి హ్యాట్రిక్ హిట్లిచ్చిన త్రివిక్ర‌మ్ మ‌హేష్ కి మాత్రం హ్యాట్రిక్ ఫ్లాపులిచ్చాడు. అందుకే మ‌హేష్ ఫ్యాన్స్ లో తీవ్ర నిరాశ‌. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఎవ‌రితోను సినిమా తీయ‌డం లేదు. ఈ తీరిక స‌మ‌యంలో స్క్రిప్టు ప‌నుల్లో ఉన్నాడు. ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో అత‌డి త‌దుప‌రి ప్ర‌ణాళిక ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News