బాలీవుడ్ ఆధిపత్యంపై నిప్పులు చెరిగిన ఉదయనిది
ఉత్తరాదిలోని మరాఠీ, హర్యాన్వి, బిహారీ, గుజరాతీ పరిశ్రమలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని.. హిందీ చిత్రాలను ప్రమోట్ చేసేందుకే పొరుగు భాషలను అణగదొక్కారని వ్యాఖ్యానించారు.
సనాతన ధర్మం గురించి తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ ప్రకటనలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. దీనిని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన సనాతన ధర్మం క్యాంపెయిన్ ని వ్యతిరేకిస్తూ ఉదయనిధి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదయనిధి-ప్రకాష్ రాజ్ డ్యూయో సనాతనంపై చేసిన ప్రకటనలు, పవన్ ని వ్యతిరేకించడం వగైరా ఎపిసోడ్ ల అభిమానుల్లో చర్చగా మారాయి. ఈ ఎపిసోడ్స్ ఇలా ఉండగానే ఉత్తరాది సినీపరిశ్రమలపై ఉదయనిధి చేసిన ఓ కామెంట్ వివాదాస్పదంగా మారింది.
తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ పూర్తికాలం రాజకీయాల్లోకి రాకముందు తమిళ చిత్రసీమలో కొద్దికాలం పనిచేశానని తాజా ప్రకటనలో గుర్తు చేసారు. దక్షిణ భారతదేశం శక్తివంతమైన చలనచిత్ర పరిశ్రమలతో అంతకంతకు అభివృద్ధి చెందుతుందని, ఉత్తరాదిలోని మరాఠీ, హర్యాన్వి, బిహారీ, గుజరాతీ పరిశ్రమలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని.. హిందీ చిత్రాలను ప్రమోట్ చేసేందుకే పొరుగు భాషలను అణగదొక్కారని వ్యాఖ్యానించారు.
ఈరోజు తమిళ చిత్ర పరిశ్రమ కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తోంది. అదేవిధంగా కేరళలో మనకు అభివృద్ధి చెందుతున్న సినీపరిశ్రమ ఉంది. నిజానికి ఈ మధ్య కాలంలో రూపొందుతున్న మలయాళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నాయి. అయితే ఒక్కసారి ఆలోచించండి.. దక్షిణ భారతదేశంలో లాగా ఉత్తర భారతదేశంలో మరే ఇతర భాష అయినా శక్తివంతమైన సినీపరిశ్రమను సృష్టించిందా? అని ప్రశ్నించారు ఉదయనిది.
ఉత్తర భారత రాష్ట్రాల్లో మాట్లాడే అన్ని భాషలు దాదాపు హిందీకి దూరమయ్యాయి. ఫలితంగా వారి వద్ద హిందీ సినిమాలు మాత్రమే కనిపిస్తాయి! అని అన్నారు. కోజికోడ్‌లో మలయాళ మనోరమ నిర్వహిస్తున్న మూడు రోజుల ఆర్ట్ అండ్ లిటరరీ ఫెస్టివల్‌లో మనోరమ హోర్టస్‌లో ప్రసంగించిన ఉదయనిధి పైవిధంగా వ్యాఖ్యానించారు. ముంబైలో హిందీ చిత్రాలను మాత్రమే ఎక్కువగా నిర్మిస్తున్నారని, ఇతరులను తగ్గించారని కూడా ఎద్దేవా చేసారు. మరాఠీ, భోజ్‌పురి, బిహారీ, హర్యాన్వీ లేదా గుజరాతీ పరిశ్రమలు హిందీ చిత్రాల కంటే చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఉత్తర భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాలు భాషను రక్షించుకోవడంలో విఫలమైతే, హిందీ మన సంస్కృతిని స్వాధీనం చేసుకుంటుంది. మన గుర్తింపును నాశనం చేస్తుంది.. అని తీవ్రంగా విమర్శించారు.