అంధుడిగా చరణ్.. నిజమెంత?
ముఖ్యంగా చరణ్ పాత్రకు సంబంధించి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ చిత్రంగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఘన విజయం తర్వాత, గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చరణ్, ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఈ సినిమాను మొదలుపెట్టారు. ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని ముందే వెల్లడైంది. అయితే దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చరణ్ పాత్రకు సంబంధించి రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గత ఏడాది నుంచే మొదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా, చరణ్ కు సంబంధించిన సన్నివేశాలను మొదటగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా, టెక్నికల్ గా అత్యున్నత ప్రమాణాలతో రూపొందనుంది. అయితే తాజాగా చరణ్ క్యారెక్టర్ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
చరణ్ ఈ సినిమాలో అంధుడి పాత్రలో నటించనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. నిజానికి, ఈ సినిమాలో చరణ్ ఒక వైకల్యం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నారు, కానీ కళ్ళు కనిపించని పాత్ర మాత్రం కాదు. బుచ్చిబాబు ఇప్పటికే స్క్రిప్ట్‌ను చాలా రీసెర్చ్ చేసి తయారు చేశారని, పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని టాక్ ఉంది. అయితే ఆ డిఫరెన్స్ అందుడిగా కాకుండా మరేదో ఉండబోతోందని క్లారిటీ వచ్చింది.
ఈ సినిమా చరణ్ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన ప్రయోగంగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో ఉండే కథాంశం, ఊహించని మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉప్పెన సినిమాతో వైవిధ్యమైన కథను చెప్పగలగిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఇప్పుడు చరణ్ కోసం మరింత పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక స్పోర్ట్ హైలెట్ కానుందనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల షూటింగ్ విషయంలో వేగాన్ని పెంచిన దర్శకుడు ఈ సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని చూస్తున్నాడు. మొత్తంగా చూస్తే, రామ్ చరణ్ పాత్రపై వచ్చిన ఈ రూమర్లకు తెరపడింది. అభిమానులు ఊహించుకున్నట్టు అంధుడి పాత్రలో అయితే రాబోవడం లేదని స్పష్టమైంది. కానీ, ఇందులో చరణ్ చేస్తున్న పాత్ర మాత్రం పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుందని, మరోసారి తన నటనతో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.