ముందు చూపు ముఖ్యం: ఎగ్ ఫ్రీజింగ్‌పై స్టార్స్ క్యాంపెయిన్
దీనిని బట్టి భవిష్యత్‌లో పిల్లల్ని కనే విధానం ఎలా మారబోతోందో అర్థం చేసుకోవాలి.
పిల్లల కోసం అండాన్ని దాచుకోవడం.. దీనినే ఎగ్ ఫ్రీజింగ్ అని పిలుస్తున్నారు. యుక్త వయసులో అండాన్ని ఫ్రీజ్ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం అని వైద్యులు చెబుతున్నారు. దీనిని బట్టి భవిష్యత్‌లో పిల్లల్ని కనే విధానం ఎలా మారబోతోందో అర్థం చేసుకోవాలి.
ఉపాసన కొణిదెల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో `ఎగ్ ఫ్రీజింగ్` గురించి ప్రస్థావించారు. పిల్లలను కనే విషయంలో మహిళలు తమ ఎంపికలపై నియంత్రణ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఉపాసన వెల్లడించారు. ఇప్పుడే పిల్లల్ని కనాలనుకోని దంపతులకు ఎగ్ ఫ్రీజింగ్ ఒక ఆప్షన్. ఆధునికతను అనుసరించడం తప్పేమీ కాదని ఉపాసన అన్నారు. భవిష్యత్‌లో పిల్లలను కనాలంటే యుక్తవయసు దశలోనే ఎగ్ ఫ్రీజింగ్ (అండాన్ని దాచి పెట్టడం) చేయాలనే ప్రయత్నం మంచిదని ఇంతకుముందు కథానాయిక మృణాల్ ఠాకూర్ .. మెహ్రీన్ కౌర్ పిర్జాదా వంటి సెలబ్రిటీలు మద్ధతుగా మాట్లాడారు. మాజీ మిస్ ఇండియా ఈషా గుప్తా కూడా తాను అలాంటి జాగ్రత్త తీసుకున్నానని తెలిపారు. గుడ్లను దాచి ఉంచడం (ఫ్రీజింగ్) వల్ల వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు పుట్టవచ్చని ప్రజలకు వివరించి చెప్పారు. ఎగ్ ప్రీజింగ్ నిర్ణయం సరైనదేనని పలువురు బ్లాగర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
పిల్లలను కనే విషయంలో ఆలస్యం చేయడం మంచిది కాదని ఉపాసన తన గత ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. మహిళలు తమ శరీర తత్వం భవిష్యత్తు గురించి సమాచారం తెలుసుకోవాలని ఉపాసన అభిప్రాయపడ్డారు. స్త్రీలు సంతానోత్పత్తి ఎంపికల గురించి మరింత బహిరంగంగా మాట్లాడాలని ..కొన్ని నిర్ణయాలలో మహిళలకు మద్దతు ఇవ్వాలని కూడా ఉపాసన అన్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది వైద్య పరమైన.. భావోద్వేగాలతో కూడుకున్న నైతిక అంశమని .. జాగ్రత్తగా ఆలోచించాల్సిన ఒక పెద్ద విషయమని కూడా ఉపాసన సూచించారు.