టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ డెబ్యూ.. నిజమెంత?

హీరో ప్రభాస్ మున్నా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.

Update: 2024-04-26 08:23 GMT

హీరో ప్రభాస్ మున్నా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. గత ఏడాది కోలీవుడ్ లోకి అడుగుపెట్టారు. దళపతి విజయ్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన వారిసు(వారసుడు) 2023 సంక్రాంతికి విడుదలై సందడి చేసింది. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా ఈ మూవీతో కమర్షియల్ సక్సెస్ సాధించారాయన.

ఈ సినిమా తర్వాత మరో మూవీ స్టార్ట్ చేయలేదు వంశీ పైడిపల్లి. అయితే ఆయన బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. షాహిద్‌ కపూర్‌ హీరోగా వంశీ పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను రూపొందించనున్నారని టాక్ నడుస్తోంది. షాహిద్ కపూర్ కు ఇప్పటికే స్టోరీని వంశీ చెప్పారని, దానికి ఆయన కూడా ఓకే చెప్పారంటూ నెట్టింట పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. దిల్ రాజే ఆ మూవీ నిర్మించనున్నారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్పందించారు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఎలాంటి అనౌన్స్మెంట్ చేసే ఆలోచనలో లేనని తేల్చి చెప్పారు. మరి నెక్స్ట్‌ ప్రాజెక్ట్ ఏ జోనర్ లో ఉంటుందని, ఏ భాషలో తెరకెక్కనుందన్న ప్రశ్నకు.. ఆ వివరాలు పంచుకునేందుకు ఇంకా టైమ్‌ ఉందని తెలిపారు. ప్రస్తుతానికి ఏది కూడా రివీల్‌ చేయలేనని చెప్పారు.

ఇక దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కిన వారిసుకు దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించారు. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రానికి పలు కమర్షియల్‌ హంగులు జోడించి వంశీ ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ తర్వాత దళపతితో మరో సినిమా చేయడానికి ట్రై చేశారు వంశీ. కానీ అది కుదరలేదు. అలా ఇప్పటి వరకు ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు.

చెప్పాలంటే మున్నాతో వంశీ పైడిపల్లిని దర్శకుడిగా దిల్ రాజే పరిచయం చేశారు. ఆ తర్వాత బృందావనం, ఎవడు, మహర్షి, వారిసు సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. వంశీ పైడిపల్లి తీసిన ఊపిరి తప్ప మిగతా అన్ని సినిమాల ప్రొడక్షన్ లో దిల్ రాజు భాగమయ్యారు. అందుకే షాహిద్, వంశీ పైడిపల్లి సినిమా రూమర్లలో కూడా దిల్ రాజు పేరు వినిపించింది. మరి ఎప్పటికైనా వంశీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News