అంచ‌నాలు పెంచుతున్న విశ్వంభ‌ర డైరెక్ట‌ర్ పోస్ట్

భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని మ‌రీ యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ట‌తో విశ్వంభ‌ర‌ను మొద‌లుపెట్టాడు.

Update: 2025-01-27 06:17 GMT

భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకుని మ‌రీ యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ట‌తో విశ్వంభ‌ర‌ను మొద‌లుపెట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా సోషియో ఫాంట‌సీ జాన‌ర్ లో రూపొందుతుంది. చిరూ చాలా కాలం త‌ర్వాత ఈ జాన‌ర్ లో సినిమా చేస్తుండ‌టంతో సినిమాపై మంచి హైప్ నెల‌కొంది.

వాస్త‌వానికి విశ్వంభ‌ర సంక్రాంతికి రావాల్సింది కానీ షూటింగ్ లో జాప్యం, వీఎఫ్ఎక్స్ ఇంకా కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం షూటింగ్ ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్న డైరెక్ట‌ర్ వ‌శిష్ట ఇప్పుడు ఎక్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ఖైదీ సినిమాలో చిరంజీవి వింటేజ్ వీడియో క్లిప్ ను షేర్ చేస్తూ ఫైర్ ఎమోజీతో పోస్ట్ చేశాడు.

దీంతో వశిష్ట చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సినిమాకి, విశ్వంభ‌ర‌కి ఏదైనా లింక్ ఉందా లేక చిరూ కెరీర్లో ఖైదీ సినిమాలానే ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని హింట్ ఇస్తూ ఈ పోస్ట్ చేశాడా అనేది మాత్రం ఆయ‌నే క్లారిటీ ఇవ్వాలి. త్రిష హీరోయిన్ గా న‌టిస్తున్న విశ్వంభ‌ర‌లో మీనాక్షి చౌద‌రి ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.

యువీ క్రియేష‌న్స్ సంస్థ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై మొద‌ట్లో భారీ అంచ‌నాలుండేవి. కానీ ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో ఆ టీజ‌ర్ లోని వీఎఫ్ఎక్స్ వ‌ల్ల సినిమాపై కాస్త నెగిటివిటీ వ‌చ్చింది. దీంతో చిత్ర యూనిట్ వీఎఫ్ఎక్స్ టీమ్ ను మార్చి వేరే టీమ్ కు ఆ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. విశ్వంభ‌ర సోషియో ఫాంట‌సీ సినిమా కావ‌డంతో వీఎఫ్ఎక్స్‌కు ప్రాధాన్య‌త ఎక్కువ ఉంటుంది. అందుకే డైరెక్ట‌ర్ ఈ విష‌యంలో కాస్త ఎక్కువ జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే విశ్వంభ‌రకు రిలీజ్ డేట్ ను ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో మే9 న సినిమాను రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఇదే రోజున రిలీజైన చిరంజీవి సోషియో ఫాంట‌సీ మూవీ జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి బ్లాక్ బ‌స్ట‌రైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంట‌సీ మూవీ విశ్వంభ‌ర కూడా అదే రోజున రిలీజ‌వుతుంద‌ని వ‌స్తున్న వార్త‌లు విని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News