సంక్రాంతికి వస్తున్నాం.. టైటిల్ ఇదే!

ఈ ఏడాది మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి ముగ్గురు స్టార్స్ తో పోటీ పడి హనుమాన్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యింది.

Update: 2024-08-31 03:58 GMT

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి అతిపెద్ద ఫెస్టివల్. ఈ సీజన్ లో టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకి వస్తూ ఉంటాయి. సంక్రాంతి రేసులో ఎవరు పోటీ ఉన్నా కూడా ప్రేక్షకుల నుంచి అన్ని సినిమాలకి మంచి ఆదరణ ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతూ ఉంటారు. అయితే అది స్టార్ హీరోలకి ఎక్కువ వర్తిస్తుంది. చిన్న హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మౌత్ టాక్ తో సంక్రాంతి విన్నర్ గా మారే ఛాన్స్ ఉంటుంది.

ఈ ఏడాది మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి ముగ్గురు స్టార్స్ తో పోటీ పడి హనుమాన్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యింది. మూవీకి హిట్ టాక్ రావడంతో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 300 కోట్ల వరకు కలెక్షన్స్ ని అందుకుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచే హీరోలు కర్చీఫ్ లు వేసేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాని జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

బాలకృష్ణ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తారంట. మరికొన్ని సినిమాలు కూడా సంక్రాంతి రేసులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఒక సినిమా కోసం "సంక్రాంతికి వస్తున్నాం'' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారంట. ఈ టైటిల్ బట్టి ఎంటర్టైన్మెంట్ జోనర్ లో మూవీ ఉంటుందని అర్ధమవుతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకి ఈ టైటిల్ ని పెడుతున్నట్లు చాలా కాలంగా ప్రచారం నడుస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సంక్రాంతి ఫెస్టివల్ దిల్ రాజుకి బాగా కలిసొచ్చే టైం. గతంలో దిల్ రాజు బ్యానర్ నుంచి చాలా మూవీస్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాని కూడా అదే టైంకి ఫిక్స్ చేశారు.

సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కూడా ఈ సినిమా కోసమే పెట్టి ఉంటారనే ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది వెంకటేష్ సంక్రాంతి రేసులో సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. వచ్చే ఏడాది మాత్రం హిట్ కొట్టే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News