2026 సంక్రాంతికి పక్కాగా వెంకీ మామ..!
ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు ఏమీ లేవని, అయితే ఇప్పటికే నలుగురు, ఐదుగురు నిర్మాతలతో కమిట్‌మెంట్‌లు ఉన్నాయి అంటూ అధికారికంగా ప్రకటించాడు.
గత సంవత్సరం సంక్రాంతికి సైంధవ్ సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథ ఎంపిక చేసుకుని అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో సంక్రాంతి కానుకగా వచ్చేశాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ మాట్లాడుతూ తన ఫ్యూచర్ ఫిల్మ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు ఏమీ లేవని, అయితే ఇప్పటికే నలుగురు, ఐదుగురు నిర్మాతలతో కమిట్‌మెంట్‌లు ఉన్నాయి అంటూ అధికారికంగా ప్రకటించాడు.
తమ హోం బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌లో ఒక సినిమాను చేయాల్సి ఉందని, అంతే కాకుండా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో, మైత్రి మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సినిమాలు చేయాల్సి ఉందని వెంకటేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం నలుగురు ఐదుగురు దర్శకులు కథను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఏ దర్శకుడు ముందుగా కథను రెడీ చేస్తే ఆ దర్శకుడితో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్, అనుదీప్, విమల్ కృష్ణ తదితరులు కథలు రెడీ చేసే పనిలో ఉన్నారు. అతి త్వరలోనే వెంకటేష్ వద్దకు ఫైనల్ నరేషన్ కోసం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్ కి నచ్చితే వెంటనే షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సమ్మర్ వరకు ఏ సినిమా కన్ఫర్మ్ అయినా కచ్చితంగా వెంకటేష్ 2026 సంక్రాంతికి కర్చీఫ్ వేయడం ఖాయం అనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్‌తో సినిమా కచ్చితంగా మూడు నాలుగు నెలల్లో ఏ దర్శకుడు అయినా పూర్తి చేయవచ్చు. కనుక ఈజీగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వెంకటేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ మొదట ఏ దర్శకుడికి దక్కుతుంది అనేది చూడాలి. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో ఏ నిర్మాత బ్యానర్‌లో వెంకటేష్ తదుపరి సినిమా ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ ముగ్గురి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు వచ్చాయి. ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు అంతకు మించి వసూళ్లు రాబట్టింది. కనుక మరోసారి సంక్రాంతికి వస్తున్నాం వీరి కాంబోకి హిట్ తెచ్చి పెడుతుందని అంతా నమ్మారు. రికార్డ్ స్థాయి టికెట్లు బుక్ అయ్యాయి. సంక్రాంతికి అసలైన పండుగ సినిమా అంటూ ఈ సినిమాను ప్రేక్షకులు భావించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు తగ్గట్లే ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.