హీరో లేకుండా ఈవెంట్ ఏంటి?
ముఖ్యంగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కిషోర్ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కమెడియన్లు హీరోలుగా నటించడం ఇప్పటి ట్రెండ్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, అభినవ్ గోమఠం.. ఇలా చాలామందిని హీరోలుగా చూశాం. ఇప్పుడు వీళ్లందరికంటే సీనియర్ అయిన వెన్నెల కిషోర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
అతను లీడ్ రోల్ చేసిన 'చార్లీ 111' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఐతే టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు ప్రమోషన్లు ఆశించిన స్థాయిలో చేయట్లేదనే అభిప్రాయం కలుగుతోంది.
మంచి ఫాలోయింగ్ ఉన్న వెన్నెల కిషోర్ జనాల్లోకి మరింతగా వెళ్లి సినిమాను పుష్ చేయాల్సిందని అంటున్నారు. ఐతే అతను యాంకర్ సుమతో ఒక వీడియో ఇంటర్వ్యూతో సరిపెట్టాడు. ముఖ్యంగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కిషోర్ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.
'చార్లీ 111'కు సంబంధించి ప్రేక్షకులకు ఉన్న మెయిన్ కనెక్షన్ వెన్నెల కిషోర్‌తోనే. హీరోయిన్ కొత్తమ్మాయి. దర్శకుడు, నిర్మాత అంతగా పేరు లేని వాళ్లు. వెన్నెల కిషోర్‌ను చూసే ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. అలాంటపుడు ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా అతనే హైలైట్ కావాలి.
కానీ కిషోర్ లేకుండానే ఈ ఈవెంట్ జరిగిపోయింది. తాను హీరోగా నటించిన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కిషోరే రాకపోవడం ఏంటో అర్థం కాని విషయం. కిషోర్ బిజీ నటుడే కానీ.. తాను హీరోగా చేసిన సినిమాకు ఒక సాయంత్రం కేటాయించలేకపోవడమేంటో? ఖాళీ లేకే ఈ ఈవెంట్‌కు రాలేదా.. లేక దర్శక నిర్మాతలతో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది తెలియదు మరి. కానీ ప్రామిసింగ్ కామెడీ మూవీలా కనిపిస్తున్న 'చార్లీ 111'ను అతను ఆశించిన స్థాయిలో పుష్ చేయకపోవడం మాత్రం తప్పిదమే.