వేణు స్వామి మళ్ళీ మొదలుపెట్టాడా?
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాలుడి పేరిట మృత్యుంజయ హోమం చేస్తానని వేణుస్వామి తెలిపారు.
'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడుని ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఈ క్రమంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణు స్వామి మంగళవారం శ్రీ తేజ్ ను పరామర్శించారు.
కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన వేణు స్వామి..శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరలోనే బాలుడు కోలుకుంటాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన తనవంతుగా రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేశాడు. రూ.2 లక్షల చెక్ ను రేవతి భర్త భాస్కర్ కు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాలుడి పేరిట మృత్యుంజయ హోమం చేస్తానని వేణుస్వామి తెలిపారు. జాతకాలను బట్టి అన్ని జరుగుతాయని, వచ్చే ఏడాది మార్చి 28 వరకూ అల్లు అర్జున్ జాతకం బాగాలేదని పేర్కొన్నారు.
"ఇప్పుడే శ్రీ తేజ్ ను చూసి వచ్చాను. వాళ్ళ నాన్న టచ్ చేసినప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. వెంటిలేటర్ సహాయం లేకుండానే శ్వాస తీసుకుంటున్నాడు. కచ్ఛితంగా త్వరలోనే కోలుకుంటాడని ఆశిద్దాం. వారికి ఏం సహాయం చేద్దామని అనుకుంటుండగా, మృత్యుంజయ హోమం నిర్వహించమని చాలామంది సూచిస్తున్నారు. నా సొంత ఖర్చుతో మృత్యుంజయ హోమాన్ని శ్రీ తేజ్ పేరున చేస్తాను. అందరూ శ్రీ తేజ్ గురించే మాట్లాడుతున్నారు. ఆ కుటుంబంలో ఒక చిన్న పాప కూడా ఉంది. పాప కోసం నా వంతు సహాయగా 2 లక్షలు ఆ ఫ్యామిలీకి అందజేసాను. దాదాపు 1000 సినిమాలకు ముహూర్తాలు పెట్టిన వాడిని కాబట్టి, నేను కూడా సినీ ఇండస్ట్రీ సొమ్మును తిన్నవాడినే. అందుకే నా వంతు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను" అని వేణు స్వామి అన్నారు.
బాలుడిలో కదలిక ఉందని, 90 శాతం డెవలప్ మెంట్ కనిపించిందని వేణు స్వామి తెలిపారు. ఒక నెల అటు ఇటు అయినా శ్రీతేజ్ తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటాడని, దాని కోసం ఈ వారంలోనే మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తానని చెప్పారు. ''ఏవైనా జాతకాలను బట్టి జరుగుతాయి. అల్లు అర్జున్ జాతక రీత్యా ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అలానే జరుగుతుంది. దానికి ఎవరూ అతీతులు కాదు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటదో, రిస్క్ అక్కడ ఉంటది. ప్రతీ దగ్గర సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా ఎవరూ ఉండరు. అది వచ్చినప్పుడు ఫేస్ చెయ్యాలి అంతే. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. కావాలని ఎవరూ చెయ్యరు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతాయి. ఆ తప్పు నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మార్చి 29 వరకూ అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. ఆ తర్వాత అంతా బాగుంటుంది" అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం ప్రకటించారు. అల్లు అర్జున్ తరఫున రూ. 1 కోటి.. 'పుష్ప 2' నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంబంధిత చెక్కులను ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు నిర్మాత అల్లు అరవింద్ అందజేశారు.