మహిళా జర్నలిస్ట్ ఫోన్ లాక్కున్న బన్నీ సెక్యూరిటీ ?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2తో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2తో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. వరుసగా పాన్ ఇండియా ఈవెంట్స్ తో మేకర్స్ ప్రస్తుతం అలరిస్తున్నారు. రోజురోజుకు చిత్రంపై ఓ రేంజ్ లో బజ్ పెంచుకుంటూ పోతున్నారు.
రీసెంట్ గా ముంబైలో మేకర్స్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్.. సూపర్ సక్సెస్ అయింది. ఆ సమయంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. వేదికపై రష్మికతో కలిసి బన్నీ ఓ రేంజ్ లో సందడి చేశారు. ఆ ఈవెంట్ ద్వారా నార్త్ లో కూడా పుష్పకు ఎలాంటి క్రేజ్ ఉందో మరోసారి గట్టిగా ప్రూవ్ అయింది.
అయితే ముంబై ప్రెస్ మీట్ కు అటెండ్ అయిన మహిళా జర్నలిస్ట్ విభా కౌల్ భట్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెట్టారు. అల్లు అర్జున్ ఎంట్రీని రికార్డ్ చేస్తున్న సమయంలో తన ఫోన్ ను హీరో సెక్యూరిటీ లాక్కున్నారని ఆరోపించారు. ఆ తర్వాత తన ఫోన్ ను నేలపై విసిరేశారని విభా కౌల్ భట్ చెప్పారు.
అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇలాంటి విషయాలు ఐకాన్ స్టార్ గమనించాలని, లేకుంటే ఆయనపై చెడు ప్రభావం ప్రతిబింబిస్తుందని రాసుకొచ్చారు. ఆ తర్వాత మరో పోస్ట్ లో అల్లు అర్జున్ ను ట్యాగ్ చేస్తూ మీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో గమనించాలని కోరారు. కొన్ని ఈవెంట్స్ విషయంలో భయం కలుగుతుందని.. పుష్ప2 ఈవెంట్ లో అదే జరిగిందని తెలిపారు.
ఏదేమైనా తనకు ఎదురైన అనుభవం విషయంలో చాలా నిరాశకు గురయ్యారు జర్నలిస్ట్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ స్పందించి క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. తన మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి దీనిపై బన్నీ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.
ఇప్పుడు అల్లు అర్జున్... తెలుగు ఈవెంట్ కు రెడీ అవుతున్నారు. హైదరాబాదులోని యూసఫ్ గ్రౌండ్స్ లో రేపు భారీ వేడుక జరగనుంది. ఆ కార్యక్రమానికి బన్నీ, రష్మిక, సుకుమార్ సహా టీమ్ అంతా అటెండ్ అవ్వనుంది. చీఫ్ గెస్టులుగా కొందరు ప్రముఖులను ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎవరు వస్తారో..