బాల‌య్య దండు క‌దిలింది!

Update: 2015-12-20 07:56 GMT
త‌న సినిమాకి సంబంధించి ప్ర‌తీ ఫంక్ష‌న్ అభిమానుల‌కి ఓ పండ‌గ కావాల‌నుకుంటాడు బాల‌య్య‌. అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా స‌రే... అభిమానుల సమ‌క్షంలో ఫంక్ష‌న్‌ లు నిర్వ‌హించేలా నిర్మాత‌ల్ని పుర‌మాయిస్తుంటాడు. లెజెండ్ 500 రోజుల వేడుక‌ని క‌ర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘ‌నంగా నిర్వ‌హించారు. అందుకోస‌మ‌ని హైద‌రాబాద్ నుంచి బ‌స్సులో వెళ్లాడు బాల‌య్య‌. తాజాగా డిక్టేట‌ర్ ఆడియో వేడుక‌ని ఆంధ్ర రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్వ‌హిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజ‌ధానిలో నిర్వ‌హిస్తున్న తొట్ట తొలి ఆడియో వేడుక బాల‌కృష్ణ‌దే కావ‌డం విశేషం.

 ఈరోజు రాత్రి జ‌ర‌గ‌నున్న ఆ వేడుక కోసం బాల‌య్య దండు భారీ ఎత్తున హైద‌రాబాద్ నుంచి త‌ర‌లివెళ్లింది. బాల‌కృష్ణతో పాటు చిత్ర‌బృందం బ‌స్సులో బ‌య‌ల్దేర‌గా ఆయ‌న వెన‌కాల 99కార్లతో ఒక ర్యాలీ బ‌య‌ల్దేరింది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించ‌ద‌ల పెట్టిన ఆడియో వేడుక‌కి తెలుగు రాష్ట్రాల న‌లుమూల‌ల నుంచి అభిమానులు త‌ర‌లివెళుతున్నారు. బాల‌య్య రోడ్డు మార్గం గుండా వ‌స్తున్నాడ‌ని తెలియ‌డంతో అభిమానులు అడుగడుగునా ఆయ‌న్ని ఆపుతూ స‌న్మానాలు చేస్తూ సాగ‌నంపుతున్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త రాజ‌ధానిలో జ‌రుపుతున్న తొలి ఆడియో వేడుక కావ‌డంతో గుంటూరు, విజ‌య‌వాడ పోలీసులు గ‌ట్టి బంధోబ‌స్తుని ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News