ఫ్యామిలీ స్టార్.. బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వాలంటే..
గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్
గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ సరసన టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా సందడి చేయనుంది.
టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు.. ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో హీరోయిన్లతో పాటు హుషారుగా పాల్గొన్నారు. ఎప్పుడూ లేనంతగా ఫోటోలు దిగుతూ, ఓ ఈవెంట్ లో డ్యాన్స్ కూడా చేశారు. దిల్ రాజు ప్రమోషన్లకు అంతా షాకయిపోయారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిన ఈ సినిమాకు అన్ని సెంటర్ల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీకి మంచి థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.44 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.35 కోట్లు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ రూ.3.5 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.5 కోట్ల బిజినెస్ జరిగింది. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే ఈ సినిమా రూ.45 కోట్ల వసూళ్లు రాబట్టాలి. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా కంప్లీట్ చేసుకుంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.
ఫుల్ ప్యాక్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి వేసవి బాగా కలిసొస్తుందని చెబుతున్నారు. విజయ్ తో పాటు టీమ్ అంతా కూడా మూవీ కచ్చితంగా అందరినీ అలరిస్తుందని హామీ ఇస్తున్నారు. ఏదైనా మౌత్ టాక్ పాజిటివ్ గా వస్తే చాలు.. సినిమా దూసుకుపోతోంది. గీత గోవిందం కాంబో రిపీట్ అవ్వడంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు అభిమానుల్లో మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
విజయ్ దేవరకొండ చివరగా నటించిన ఖుషి మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ టార్గెట్ ఇలాంటిదే. కానీ ఖుషి థియేట్రికల్ రన్ త్వరగా ముగిసింది. దాని వల్ల వసూళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ క్లిక్ అయితే.. ఈజీగా టార్గెట్ ను పూర్తి చేసుకుని లాభాలు కురిపిస్తుంది. మరి ఫ్యామిలీ స్టార్.. సమ్మర్ అడ్వాంటేజ్ ను వినియోగించుకుంటుందో లేదో వేచి చూడాలి. ఎటు తిరిగి సినిమాకు మంచి టాక్ రావాలి. పోటీగా కూడా ఇప్పుడు పెద్దగా సినిమాలు ఏమి లేవు. ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ దొరికితే సినిమాలకు తిరుగుండదు. కాబట్టి సినిమా టాక్ ఎలా ఉంటుందో దానిపైనే కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి.