విజయ్ దేవరకొండ.. ఫస్ట్ బ్రేక్ చేయాల్సిన రికార్డ్ ఇదే!
సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే కచ్చితంగా ఖుషి రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే యూఎస్ లో పడిపోయాయి. తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలతో స్క్రీనింగ్ స్టార్ట్ కానున్నాయి. ఫ్యామిలీ స్టార్ మూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.
లైగర్ సినిమాకి విజయ్ దేవరకొండ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరిగింది. దీని తర్వాత ఖుషి చిత్రంపైన కూడా 51 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నుంచి ఫ్యామిలీ స్టార్ వచ్చింది. ఈ సినిమాపై 45 కోట్ల వ్యాపారం జరిగింది. బజ్ పరంగా చూసుకుంటే ఖుషి కంటే ఈ చిత్రంపైనే ఎక్కువ హైప్ ఉంది.
విజయ్ దేవరకొండ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ బట్టి ఆయనకి యూత్ ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. రౌడీ స్టార్ కెరియర్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన చిత్రం అంటే ఖుషి అని చెప్పాలి. ఈ సినిమా 9.87 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. లైగర్ మూవీ టాప్ 2లో ఉంది. ఈ చిత్రం 9.57 కోట్ల షేర్ మొదటి రోజు అందుకుంది. తరువాత మాత్రం ఈ మూవీ అస్సలు కోలుకోలేదు. డియర్ కామ్రేడ్ సినిమాకి 7.50 కోట్ల షేర్ వచ్చింది.
గీతాగోవిందం మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.81 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. తమిళ్, తెలుగు బై లింగ్వల్ మూవీ నోటా కూడా 4.55 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ కెరియర్ లో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయని ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా కేవలం 4.40 కోట్ల షేర్ మాత్రమే మొదటి రోజు సాధించింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే కచ్చితంగా ఖుషి రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇమేజ్ తోపాటుగా బడా నిర్మాణ సంస్థ, సక్సెస్ ఫుల్ కాంబినేషన్, స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫేమ్ కూడా ఫ్యామిలీ స్టార్ మూవీకి కలిసొచ్చే అంశాలు. 10 నుంచి 15 కోట్ల మధ్యలో మొదటి రోజు ఈ సినిమాకి షేర్ వస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.