దళపతి స్థాయిని అమాంతం పెంచిన కనగరాజ్
సౌతిండియాలో టాప్- 5 డైరెక్టర్స్ జాబితాను వెతికితే.. ఇందులో ఎస్.ఎస్.రాజమౌళి- శంకర్- సుకుమార్- ప్రశాంత్ నీల్ సహా కచ్ఛితంగా లోకేష్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది
సౌతిండియాలో టాప్- 5 డైరెక్టర్స్ జాబితాను వెతికితే.. ఇందులో ఎస్.ఎస్.రాజమౌళి- శంకర్- సుకుమార్- ప్రశాంత్ నీల్ సహా కచ్ఛితంగా లోకేష్ కనగరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఖైదీ (కైతీ తమిళం)- విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తానేంటో నిరూపించిన లోకేష్ గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్లతో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పుడు దళపతి విజయ్ తో 'లియో' లాంటి భారీ యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించాడు. లియో ఈరోజు థియేటర్లలోకి విడుదలైంది. సీట్ అంచున కూచోబెట్టేంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాయడంలో ఎమోషన్స్ ని పండించడంలో వర్కవుట్ చేయగలడు గనకనే కనగరాజ్ తెరకెక్కించే యాక్షన్ సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు.
మునుపెన్నడూ లేని విధంగా బాలకృష్ణ (భగవంత్ కేసరి, రవితేజ (టైగర్ నాగేశ్వరరావు) సినిమాలను మించి భారీ ఓపెనింగులతో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమవుతున్న 'లియో' గురించి తెలుగువారిలోను ఆసక్తికర చర్చ సాగుతోంది. 'తుపాకి' (తుప్పాక్కీ తమిళం) లాంటి క్లాసిక్ సినిమాలో నటించినా కానీ దళపతి విజయ్ కి తెలుగు నాట ఏమంత బజ్ పెరగలేదు. తుపాకి తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంతగా ఆడలేదు. ఆ తర్వాత విజయ్ నటించిన హిట్ తమిళ సినిమాలకు అనువాదాలు వచ్చిన మనవాళ్లను ఆకట్టుకోలేదు. కానీ లియోతో దళపతికి గొప్ప క్రేజ్ ని తేగలగాడు లోకేష్ కనగరాజ్. అతడు తెరకెక్కించిన ఖైదీ- విక్రమ్ సినిమాల ఘనవిజయంతో ఇక్కడా అతడికి భారీ మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు లియోకి కూడా అదనపు దన్నుగా నిలిచింది తెలుగు రాష్ట్రాల్లోని ఈ మాస్ ఆడియెన్ అనడంలో సందేహం లేదు.
విజయ్ లియో చిత్రంలో మెరుపులు మెరిపిస్తాడని, ఈ సినిమా స్క్రీన్ ప్లే వైవిధ్యంగా ఉంటుందని, యాక్షన్ పరంగా మరో లెవల్ ఏంటో చూపిస్తాడని ఇలా రకరకాలుగా దీని గురించి ఊహించుకుంటున్నారు ఆడియెన్. మరి కాసేపట్లో రివ్యూలు వచ్చేస్తాయి. ఫలితం ఏంటో చెప్పేస్తారు. కానీ ఇంతలోనే లియోకి వచ్చిన బజ్ గురించి ఎవరికి వారు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతానికి శంకర్ తర్వాతి స్థానం లోకేష్ కే ఇవ్వాల్సిందేనంటూ ఒక సెక్షన్ నెటిజనుల్లో డిబేట్ రన్ అవుతోంది. నిజానికి శంకర్ తో పాటు ఏ.ఆర్.మురుగదాస్, లింగు స్వామి లాంటి పేర్లు యాక్షన్ ఎంటర్ టైనర్లకు ముందు వరుసలో వినిపించేవి. కానీ ఇటీవలి కాలంలో మురుగదాస్, లింగుస్వామిలకు ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో వీళ్ల పేర్లు కూడా కనుమరుగైపోయాయి. కానీ ఇప్పుడు సీనియర్లను రీప్లేస్ చేస్తూ లోకేష్ కనగరాజ్ దూసుకుపోతుండడం హాట్ టాపిక్ గా మారింది.