'సూర్య-విక్రమ్'లతో శంకర్ భారీ ఫ్రాంఛైజీ?
ఇంతలోనే ఇప్పుడు శంకర్ తన తదుపరి భారీ ఫ్రాంఛైజీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన `భారతీయుడు 2` ఇటీవలే విడుదల కాగా, తదుపరి భారతీయుడు 3, గేమ్ ఛేంజర్ చిత్రాలను రిలీజ్ చేసేందుకు శంకర్ ప్రణాళికలు రచిస్తున్నారు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజర్` అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంతలోనే ఇప్పుడు శంకర్ తన తదుపరి భారీ ఫ్రాంఛైజీ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఇది పితామగన్ జోడీ సూర్య, విక్రమ్ కలయికలో ఉంటుందని, దీనిని మూడు భాగాలుగా శంకర్ తెరకెక్కిస్తారని తమిళ మీడియాలో కథనాలొస్తున్నాయి. `వేల్పారి` అనే నవల ఆధారంగా ఈ ఫ్రాంఛైజీ సినిమాలను రూపొందించనున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా క్రైసిస్ సమయంలో తాను ఒక నవల చదివాననని, దాని నుంచి కొన్ని సన్నివేశాలను కాపీ కొట్టి దర్శకులు ఉపయోగించుకున్నారని శంకర్ ఇటీవల సీరియస్ అయ్యారు. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఇంతలోనే ఇప్పుడు వేల్పారి నవల ఆధారంగా శంకర్ సినిమా తీస్తున్నారన్న చర్చ సాగుతోంది.
నిజానికి సూర్య- శంకర్ కలయికలో ఓ భారీ చిత్రం తెరకెక్కనుందని కోలీవుడ్ లో చాలా కాలంగా గుసగసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులో చియాన్ విక్రమ్ కూడా చేరడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. తమిళ సినిమాలలో అత్యంత కష్టపడి పనిచేసే స్టార్ గా సూర్యకు మంచి గుర్తింపు ఉంది. సూర్య ఇటీవల `సూరరై పొట్రు` చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. `జై భీమ్`లో తన పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. అలాగే పితామగన్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడిగా చియాన్ విక్రమ్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు జాతీయ ఉత్తమ నటులతో నేషనల్ స్టాండార్డ్ డైరెక్టర్ సినిమా తీస్తుండడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఆసక్తికరంగా తమిళంలో పాపులర్ రచయిత సు. వెంకటేషన్ రాసిన `వేల్పారి` నవల హక్కులను ఛేజిక్కించుకున్న శంకర్ దీనిని మూడు భాగాల సినిమాగా రూపొందించనున్నారని తెలుస్తోంది. రచయిత దీనిని వేల్పారి పేరుతో ఐదు భాగాలుగా నవలను రాసారు. కానీ సినిమా వరకూ మూడు భాగాలుగా తెరకెక్కించే వీలుందని తెలుస్తోంది. సూర్య కూడా గతంలో `విరుమాన్` ఆడియో లాంచ్ సందర్భంగా రచయిత వెంకటేశన్‌తో కలిసి పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఎట్టకేలకు సూర్య, విక్రమ్ లాంటి దిగ్గజ స్టార్లతో ఎస్.శంకర్ ఈ ఫ్రాంఛైజీ సినిమాల రూపకల్పనకు ప్రయత్నించడం ఆసక్తిని కలిగిస్తోంది.