విరుష్క.. ISKCON కీర్తన్‌తో ఓటమి నుంచి విముక్తి?
న్యూజిలాండ్ తో తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన కొన్ని గంటల తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో కలిసి ముంబైలో కృష్ణ దాస్ కీర్తనకు హాజరయ్యారు.
బాలీవుడ్‌లో ISKCON- కృష్ణ భక్తులకు కొదవేమీ లేదు. షాహిద్ కపూర్ - మీరా రాజ్‌పుత్, హేమ మాలిని కుమార్తెలు ఇషా డియోల్, అహనా డియోల్ సహా చాలా మంది కృష్ణ భక్తులు ఉన్నారు. విరుష్క జంట దీనిని అనుసరిస్తారు. ఈ జంట ఇంతకుముందు లండన్ లో ఉన్నప్పుడు నిరంతరం అక్కడ ఇస్కాన్ దేవాలయాన్ని సందర్శించి కీర్తనలలో పాల్గొన్నారు. దేవాధిదేవుని భక్తితో కొలిచారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు మరోసారి విరుష్క దంపతులు ముంబై ఇస్కాన్ దేవాలయంలో కనిపించారు. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన కొన్ని గంటల తర్వాత విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో కలిసి ముంబైలో కృష్ణ దాస్ కీర్తనకు హాజరయ్యారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో కీర్తనను ఆలపించారు.
ఆదివారం బెంగళూరులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంతో భారత్‌కు రియాలిటీ చెక్ లభించింది. గత నెలలో బంగ్లాదేశ్‌పై క్లీన్ స్వీప్ సహా ఆరు మ్యాచ్‌ల విజయాల పరంపరలో ఉన్న రోహిత్ శర్మ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ తొలి మ్యాచ్ లో ఆశించినదేదీ జరగలేదు. స్వదేశంలో కేవలం 46 పరుగులకు ఆలౌట్ అవ్వడం సిగ్గుచేటుగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ తొలి ఇన్నింగ్స్ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసాడు. కానీ మ్యాచ్ ఫలితం నిరాశాజనకం.
కోహ్లీ నిరంతరం తన ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కొత్త మార్గాన్ని అన్వేషించాడు. అది కచ్ఛితంగా ఇస్కాన్ సంస్కృతి అని నమ్ముతున్నాడు. అనుష్క శర్మ నుంచి అతడికి సపోర్ట్ ఉంది. ప్రస్తుతం హరేకృష్ణ కీర్తనలతో వారి ఇల్లు మంత్రముగ్ధమవుతోంది. వారి పిల్లలు లార్డ్ శ్రీకృష్ణ ఆరాలో సనాతన భారతీయ సంస్కృతి పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నారు.
ఇస్కాన్ అంటే?
ఇస్కాన్ అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు.. ఇది అంతర్జాతీయ కృష్ణ సమాజం. జీవించడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనిషిలో స్వచ్ఛతకు సంబంధించిన బోధనలు ఉంటాయి. నేడు నశించిన చాలా విలువలను నేర్చుకునే ఒక ఉన్నతమైన దైవ సన్నిధి. అందుకే భారతదేశం సహా 170దేశాల్లో ఇస్కాన్ అభివృద్ధి చెందింది. సంఘంలోని హై ప్రొఫైల్స్ తో పాటు ఇస్కాన్ సమాజం గురించి తెలుసుకునే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. గీతా సారం వింటూ జీవనం గడుపుతారు. కులమతాలతో సంబంధం లేకుండా ఇస్కాన్ లార్డ్ కృష్ణను అందరూ భక్తితో కొలుస్తున్నారు.