రెండు హిట్లిచ్చినా అంత గ్యాప్ ఎందుకొచ్చింది?

దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకోవడం అంత తేలికైన విషయం కాదు.

Update: 2024-11-07 03:59 GMT

దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. అలా సక్సెస్ సాధించిన దర్శకులను కూడా ద్వితీయ విఘ్నం వెంటాడుతూ ఉంటుంది. దీన్ని అధిగమిస్తే తిరుగుండదని భావిస్తారు. కానీ వరుసగా రెండు విజయాలు అందుకున్న ఓ దర్శకుడికి ఎనిమిదేళ్లు గ్యాప్ రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. యువ దర్శకుడు విరించి వర్మకు ఇదే అనుభవం ఎదురైంది. ‘ఉయ్యాల జంపాల’ లాంటి సర్ప్రైజ్ హిట్‌తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు విరించి.

ఆ సినిమా సూపర్ హిట్టయి విరించి మీద అంచనాలు పెంచింది. నేచురల్ స్టార్ నాని.. విరించికి రెండో అవకాశం ఇచ్చాడు. వీరి కలయికలో వచ్చిన ‘మజ్ను’ కూడా బాగానే ఆడింది. మరీ పెద్ద హిట్ కాకపోయినా సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది. కానీ విరించి తర్వాత కనిపించకుండా పోయాడు. మళ్లీ ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ నెల 8న ‘జితేందర్ రెడ్డి’ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇంత గ్యాప్ రావడానికి కారణం వివరించాడు విరించి. ‘‘మజ్ను తర్వాత కళ్యాణ్ రామ్ గారితో సినిమా ఓకే అయింది. ఈ కథ మీద ఏడాదికి పైగా పని చేశాం. ఇక ఈ సినిమా మొదలవడమే తరువాయి అనుకున్న టైంలో ఆ సినిమాతో వేరే చిత్రానికి పోలికలు ఉన్నాయనిపించి వెనక్కి తగ్గాం. తర్వాత మరో హీరోతో వేరే సినిమా చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.

తర్వాత ఆ సినిమాకు కూడా ఇలాంటి అడ్డంకే ఎదురైంది. నాతో సినిమా చేయాల్సిన హీరో, నిర్మాత కూడా చూద్దాం చేద్దాం అనే అన్నారు. కానీ అలా టైం గడిచిపోయింది. చివరికి ఒక ఓటీటీ ఫ్లాట్ ఫాం కోసం ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది. దాని మీద పని చేశా. కానీ అక్కడ నాకు ఫ్రీడం లేదనిపించింది. అందుకే బయటికి వచ్చేశా. చివరికి జితేందర్ రెడ్డి కథ నా దగ్గరికి వచ్చింది. అది మంచి కథ అనిపించి రాకేష్ వర్రాతో సినిమా ప్లాన్ చేశా. ఈ సినిమా కూడా కొంచెం ఆలస్యం కావడంతో కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది’’ అని విరించి వర్మ తెలిపాడు.

Tags:    

Similar News