హీరో రాక కోసం మధ్యాహ్నం వరకూ వెయిటింగ్!
చిత్రీకరణ సమయంలో ఏ విషయంలో ఎవరితో ఎవరికి సెట్ కాకపోయినా, విభేధాలు తలెత్తినా ఆ ప్రాజెక్ట్ అపసవ్య దిశలోనే ఉంటుంది.
సరైన విజయం దక్కాలంటే దర్శకనిర్మాతలతో హీరో సింక్ అయి పని చేయాలి. అన్నివిధాలా చిత్రకథానాయకుడు సహకరిస్తేనే సినిమాని సజావుగా అనుకున్న సమయంలో పూర్తి చేయడం సాధ్యం. చిత్రీకరణ సమయంలో ఏ విషయంలో ఎవరితో ఎవరికి సెట్ కాకపోయినా, విభేధాలు తలెత్తినా ఆ ప్రాజెక్ట్ అపసవ్య దిశలోనే ఉంటుంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అసలేమైందో తెలీదు కానీ సదరు హీరో సెట్స్ కి ఆలస్యంగా వస్తుండడంతో విదేశీ షెడ్యూల్ అంతకంతకు డిలే అవుతోందని దర్శకనిర్మాతలు ఆందోళనలో ఉన్నారట.
సెట్లో అందరూ సిద్ధంగా ఉన్నా కానీ, హీరోగారు షూటింగుకి వచ్చేప్పటికి మధ్యాహ్నం అవుతోందట. అతడి సమయపాలన చికాకులు పెడుతోందని, హీరో వ్యవహారికంపై దర్శకనిర్మాతలు సీరియస్ గా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాకి కథానాయకుడే ఇలా చేస్తుంటే అతడినే అనుసరిస్తూ హీరోయిన్ కూడా సెట్ కి ఆలస్యంగా వస్తోందని సమాచారం. దీనిపై సెట్లో గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
కారణం ఏదైనా కానీ హీరో అలా చేయకూడదు. దీనివల్ల నిర్మాణ ఖర్చు అదుపు తప్పుతోంది. సినిమా చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమవుతోంది. ఓవరాల్ గా ప్రొడక్షన్ కాస్ట్ అదుపు తప్పితే అది ఎవరికీ మేలు కాదు. ప్రస్తుతం హీరో నిర్వాకం వల్ల విదేశీ షెడ్యూల్ తీవ్ర ఆటంకంలో పడింది. అదనపు కాల్షీట్లలో టీమ్ అంతా పని చేయాల్సి ఉంటుందని తెలిసింది. దీనివల్ల అదనపు ఖర్చు పెరుగుతోంది. ఇది నిర్మాతకు పెనుభారంగా మారుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోందని సమాచారం. ఇటీవల సరైన విజయం లేక ఇబ్బందుల్లో ఉన్న హీరో ఇప్పటికైనా మారితే బావుంటుందని అంతా భావిస్తున్నారట. ప్రస్తుతం సెట్ పై ఉన్న సినిమాపై బజ్ బాగానే ఉంది. కానీ హీరో వ్యవహారికమే ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే జరిగిన ఆలస్యంతో మరో అదనపు షెడ్యూల్ ని టీమ్ ప్లాన్ చేస్తోందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.