మ్యారేజీ బ్యూరో పెళ్లిళ్ల పచ్చి ధగాపై డాక్యు సిరీస్
అది ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోల భండారాన్ని వెలికి తీసే గొప్ప క్రతువు
ఓటీటీలకు థాంక్స్.. సంఘంలో చాలా నేరాలు ఘోరాలను, నిజ జీవిత కథలను తెలుగు ప్రేక్షకులు సహా ప్రపంచ వీక్షకులకు అందిస్తున్న ఓటీటీలకు ధన్యవాదాలు చెబితే సరిపోదు. ఓటీటీల్లో అత్యంత ఘోరమైన మోసాల గురించి తెలుసుకునే వెసులుబాటు ఇప్పుడు మనకు ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఓ డాక్యు సిరీస్ ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
అది ఆన్ లైన్ మ్యారేజ్ బ్యూరోల భండారాన్ని వెలికి తీసే గొప్ప క్రతువు. భారతదేశంలో వివాహ పరిశ్రమ మోసాలు పెట్రేగిపోతున్న తీరును వెల్లడించే సిరీస్ ఇది. ఇంటర్నెట్ యుగంలో నచ్చిన భాగస్వాముల కోసం అన్వేషణ ఆన్‌లైన్‌కు మారింది. ఇది భారీ మోసాలకు ప్రమాదాలకు ఆలవాలంగా మారింది.
ఎదుటివాడి అవసరాన్ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు నకిలీలు పుట్టుకొచ్చిన వేదిక ఇదని ప్రూవ్ అయింది.ప్రైమ్ వీడియోలోని తాజా డాక్యుమెంట్ సిరీస్ 'వెడ్డింగ్.కాన్' ఐదుగురు మహిళల నిజ జీవిత అనుభవాల చుట్టూ తెరకెక్కించిన డాక్యు సిరీస్. వివాహం కోసం వెతుకుతూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో ప్రొఫైల్‌లను సృష్టించాక వారంతా డబ్బును ఎలా కోల్పోయారు? అన్నది ఇందులో డీటెయిల్డ్ గా చూపిస్తున్నారు. కాబోయే వరులుగా నటించే ఆన్‌లైన్ కాన్ మేన్‌ల బారిన పడ్డాక సదరు బాధిత మహిళలు గణనీయమైన మొత్తంలో డబ్బును కోల్పోవడమే కాకుండా తీవ్రమైన మానసిక గాయాన్ని కూడా అనుభవిస్తారు. మహిళా బాధితుల జీవితాల్లో వరుస ఘటనలతో వివరణాత్మక ఎపిసోడ్‌లను ఈ డాక్యు సిరీస్‌లో చూపిస్తున్నారు.
వెడ్డింగ్.కాన్ .. టైటిల్ కి తగ్గట్టే పెళ్లిళ్ల పేరుతో మోసాలను బట్టబయలు చేసే ఈ సిరీస్ గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహిళలను మోసం చేయడానికి మ్యాట్రిమోనియల్ సైట్‌లను దోపిడీ చేసిన మాజీ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ మోసగాడు వంశీ కృష్ణ అరెస్టు ను ఇందులో హైలైట్ గా చూపించారు. ఎన్‌ఆర్‌ఐగా వేషాలు వేయడం, వివాహం వీసా ప్రాసెసింగ్ కోసం డబ్బు వసూలు చేయడం.. బ్యాంకింగ్ ఆధారాలను తారుమారు చేయడం సహా వంశీ కృష్ణ మోసపూరిత కార్యకలాపాల ను ఈ సిరీస్‌లో స్పష్టంగా చిత్రీకరించారు. నష్టపోయిన మహిళలు తమ లోతైన అభద్రతాభావాలను ధైర్యంగా ఈ వేదికపై వెల్లడించారని సమాచారం. బాధితుల్లో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో ఈ సిరీస్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.