సిస్టమ్ లో జరిగేది చూపించాం.. కోట బొమ్మాళి పీఎస్ పొలిటికల్ సెటైర్ కాదు..!
నవంబర్ 24న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు.
రాహుల్ విజయ్, శివాజి రాజశేఖర్ లీడ్ రోల్స్ లో తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కోటబొమ్మాళి పి.ఎస్. శ్రీకాంత్ వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలుగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు.
ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా సరే పోలీసులు క్రిమినల్స్ ని చేజ్ చేసి పట్టుకుంటారు. కానీ ఇందులో పోలీసులు పోలీసులను చేజ్ చేస్తారు. పొలిటిషన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు..? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనేది సినిమా కథ. ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు అనేది ఇందులో స్పష్టంగా చూపించారు. సిస్టమ్ లో జరిగేది మాత్రమే చూపించారు తప్ప ఇదేమి పొలిటికల్ సెటైర్ సినిమా కాదని అన్నారు శ్రీకాంత్.
డైరెక్టర్ తేజ ఈ సబ్జెక్టును బాగా డీల్ చేశాడు. తను కథ చెబుతున్నప్పుడే థ్రిల్ అయ్యాను. సినిమా శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. స్టోరీ.. స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఎక్కడ సినిమా ఎక్కడ బోర్ కొట్టదని శ్రీకాంత్ అన్నారు.
సినిమాలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్రలో నటించాను. ఈ సినిమా కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. నేను రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ మా పై ఆఫీసర్ గా ఉండి.. మమ్మల్ని పట్టుకోవడానికి చూస్తారు. వరలక్ష్మి వేసే ఎత్తులకు నేను పై ఎత్తులు వేస్తూ ఉంటాను.
అంతముందు నేను చేసిన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్.. సాంగ్స్ ఫైట్స్ అన్ని ఉంటాయి.. అయితే ఇందులో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అది ఉంటుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు చిత్రానికి ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ క్యారెక్టర్ ఇది. పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉన్న పాత్ర పోషించానని శ్రీకాంత్ అన్నారు.
ఒరిజినల్ గా పోలీస్ ఎలా ఉంటారు.. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో.. నా పర్ఫామెన్స్ లెవెల్ కూడా అలాగే ఉంటుంది. టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా యంగ్ బ్యాచ్. చాలా స్ట్రాంగ్ గా దీన్ని రూపొందించారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ సహా అందరూ.. ప్యాషన్ తో వర్క్ చేశారు. అరకు వ్యాలీ లో ఎక్కువ భాగం షూట్. నైట్ టైం అడవిలో చెప్పులు లేకుండా పరిగెత్తడం.. చేజింగ్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డామని అన్నారు.
ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను కానీ ఇందులో చూసిన లొకేషన్స్ ని ఎక్కడ చూడలేదు. పాడేరు ప్రాంతలో బాగా డెప్త్ కి వెళ్లిపోయి మరీ షూట్ చేశాం. నాకు ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాంటిది.
లింగిడి లింగిడి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సినిమాపై బజ్ చాలా బాగా పెరిగింది. సినిమా కూడా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మా అందరిలో ఉందని అన్నారు శ్రీకాంత్. ఏ ఆర్టిస్ట్ కి అయినా సిన్సియారిటీ ముఖ్యమని రాహుల్ కి, శివానికి చెప్పేవాడిని. రాహుల్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. తనను చూస్తే నా బిగినింగ్ డేస్ లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. మన తెలుగు అమ్మాయి శివాని కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తుంది. రాజకీయ నాయకుడిగా మురళీ శర్మ పోషించిన పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ సినిమాలో పాత్రతో పాటు, డైలాగ్స్ ఎమోషన్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఈ సినిమా కోసం నేను కూడా ఈగరగా వెయిట్ చేస్తున్నానని అన్నారు. ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, విద్య చాలా క్లారిటీగా దీన్ని రూపొందించారని చెప్పారు.
ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, ఎన్టీఆర్ తో దేవర చిత్రాలతో పాటు మోహన్ లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న చిత్రంలోను కీలక పాత్ర చేస్తున్నానని శ్రీకాంత్ అన్నారు.