సుకుమార్ తక్షణ కర్తవ్యం అదేనా?

ఇప్పుడు ''పుష్ప 2'' చిత్రంతో ఏకంగా రాజమౌళి రికార్డులనే బ్రేక్ చేయడం విశేషం.

Update: 2024-12-07 03:45 GMT

టాలీవుడ్ లో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే దర్శకులలో సుకుమార్ బండ్రెడ్డి ఒకరు. జీనియర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుక్కూ.. తన రెండు దశాబ్దాల కెరీర్ లో తొమ్మిది సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసారు. ప్రతీ ఫ్రేమ్ ను చెక్కుతూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనిపించుకున్న ఆయన.. సినిమా సినిమాకీ చాలా గ్యాప్ తీసుకుంటూ వస్తున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా, ఇండస్ట్రీలో ఆయన మూవీస్ ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువే ఉంది. ఎస్.ఎస్ రాజమౌళి లాంటి దర్శక ధీరుడే తనకు పోటీగా భావించారంటే, సుకుమార్ ఎలాంటి దర్శకుడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ''పుష్ప 2'' చిత్రంతో ఏకంగా రాజమౌళి రికార్డులనే బ్రేక్ చేయడం విశేషం.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేయడం ప్రారంభించింది. మొదటి రోజే రూ. 294 కోట్ల వసూళ్లను రాబట్టి, ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాగా RRR పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. మరికొన్ని రోజుల్లోనే ట్రిపుల్ ఆర్ హయ్యెస్ట్ వసూళ్లను బీట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ ఎక్సపర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ విజయం అంత ఈజీగా ఏమీ దక్కలేదు. దీని వెనుక సుకుమార్ & బన్నీల ఐదేళ్ల కష్టం ఉంది. ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్ జోలికి వెళ్లకుండా, కేవలం 'పుష్ప' ప్రాంచైజీ మీదనే కూర్చొని నిర్విరామంగా శ్రమించారు. ఇప్పుడు ప్రేక్ష‌కులు దానికి త‌గిన ఫ‌లితమే అందించారు. అయితే దీని తర్వాత సుక్కూ ప్లాన్స్ ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది.

'పుష్ప 2' తరువాత రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక హీరోల కాంబోలో రానున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే చెర్రీ ప్రస్తుతం సుక్కూ శిష్యుడు బుచ్చిబాబు సానాతో 'RC 16' మూవీలో నటిస్తున్నారు. దీని నిర్మాణంలో సుకుమార్ కూడా భాగం పంచుకుంటున్నారు. ఇది కంప్లీయే అయ్యే గ్యాప్ లో 'RC 17' స్క్రిప్ట్ రెడీ చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు దర్శకుడు చ‌క్క‌బెట్టాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఆశిష్ ను హీరోగా నిలబెట్టే బాధ్యత సుకుమార్ తీసుకోనున్నారు. ''సెల్ఫిష్'' అనే టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సుక్కూ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన విశాల్ కాశి ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే ‘పుష్ప 2’ కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు ఈ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టమని సుకుమార్ చెప్పినట్టు దిల్ రాజు ఇటీవలే ప్రెస్ మీట్ లో తెలిపారు. సో ముందుగా 'సెల్ఫిష్' లో మార్పులు చేర్పులు చేసి, ప్రాజెక్టుని గాడిలో పెట్టే అవకాశం ఉంది.

అలానే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రతో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఈ మధ్యనే అక్కినేని నాగచైతన్యతో 'NC 24' చిత్రాన్ని ప్రకటించారు. కార్తీక్ దండు ఈ మిథికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ ను సుక్కూ విని ఓకే చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే ముందు దర్శకుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా 'పుష్ప 2' ప్రాజెక్ట్ మీదనే పని చేస్తుకున్న సుకుమార్.. సక్సెస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత హాలిడేకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది. ఆయన కొంత‌కాలంగా న‌డుంనొప్పితో బాధ ప‌డుతున్నారని, త్వరలోనే అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ తర్వాతనే రామ్ చరణ్ సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెడతారని చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News